FbTelugu

ఆయ‌నో ర‌కం.. ఈయ‌నో ర‌కం!

ఇప్పుడున్న స‌మ‌యం ఎటువంటింది. ఎలా ఆలోచించాలి. ఆప‌ద నుంచి ఐదు కోట్ల ఆంధ్రుల‌ను ఎలా బ‌య‌ట‌ప‌డేయాలి. ఎవ‌ర్ని సాయం కోరాలి.

సాయం అంద‌క‌పోతే ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఏమున్నాయ‌నే క‌దా! కానీ వైసీపీ లోని కొంద‌రు నేత‌లు అతిగా ప్ర‌వ‌ర్తిస్తుంటే.. టీడీపీ అధినేత కూడా అదే దారిలో రాజ‌కీయం చేస్తున్నాడ‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు. ఏపీలో గుంటూరు, విజ‌య‌వాడ‌, నెల్లూరు, క‌ర్నూలు, విశాఖ‌ప‌ట్ట‌ణం వంటి కీల‌క‌మైన ప్రాంతాలు క‌రోనా గుప్పెట్లో చిక్కాయి. ఆయా ప్రాంతాల నుంచి ఎవ‌రెవ‌రు క‌రోనా పాజిటివ్‌ కేసులు ఎంత వ‌ర‌కూ సంచ‌రించార‌నే స‌మాచారం లేదు.

పైగా పాజిటివ్ ల‌క్ష‌ణాలున్నా చాలామంది బ‌య‌ట‌కు చెప్ప‌ట్లేదు. సున్నిత‌మైన అంశం.. పైగా మ‌తంతో ముడిప‌డిన విష‌యం కావ‌టంతో అధికార యంత్రాంగం కూడా క‌ఠినంగా ఉండ‌లేక‌పోతుంది. కేవ‌లం బ‌య‌ట‌కు రాకుండా క‌ట్ట‌డి చేయ‌టం ద్వారా జ‌నాల‌కు సోక‌కుండా ఉండాల‌నేది లాక్‌డౌన్ ల‌క్ష్యం. కానీ.. ఏపీలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాత్రం.. రెవెన్యూ న‌ష్టం వ‌స్తుందంటూ.. ఆర్ధిక లెక్క‌లు చెబుతూ కేవ‌లం లాక్‌డౌన్‌ను హాట్‌స్పాట్‌ల‌కు ప‌రిమితం చేద్దామంటాడు.

ప‌క్క‌రాష్ట్ర సీఎం కేసీఆర్ బ‌తికితే చాలు.. డ‌బ్బుల్లెక్క‌లు వ‌ద్దంటూ డైరెక్టుగా చెప్పేశాడు. ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రి భిన్నంగా ఉండ‌టం తెలుగు ప్ర‌జ‌ల‌ను ఒకింత క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంద‌నే చెప్పాలి. చంద్ర‌బాబు కూడా జ‌గ‌న్ కు లేఖ రాశాడు. కొన్ని సూచ‌న‌లు చేశాడు. మ‌రికొన్ని విమ‌ర్శ‌లూ గుప్పించాడు. ఇదిలా ఉంటే.. అమ‌రావ‌తి రాజ‌ధాని త‌ర‌లింపున‌కు వ్య‌తిరేకంగా రాజ‌ధాని గ్రామాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతూనే ఉన్నాయి. మాస్క్‌లు ధ‌రించి కూడా వారంతా వివిధ రూపాల్లో ఆందోళ‌న చేయ‌టం కొస‌మెరుపు.

తెలుగుదేశం పార్టీ మాత్రం త‌న దుర్గ‌ుణాన్ని వీడట్లేదు. మా చంద్ర‌బాబు క‌ట్టిన మెడ్‌టెక్‌లోనే వెంటిలేట‌ర్లు, మాస్క్‌లు త‌యారు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తుంది. ఇదంతా త‌మ సొంత సొమ్ముతో క‌ట్టామ‌నే బిల్డ‌ప్ ఇస్తూ న‌వ్వుల పాలువుతున్న విష‌యం మ‌ర‌చిపోతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ఉంటేనే.. అప్ప‌ట్లో హుదూద్ తుఫాన్‌ను అర‌చేతితో ఆపిన‌ట్లు.. చంద్ర‌బాబు క‌రోనా వైర‌స్‌ను కూడా ఒక్క దెబ్బ‌తో రాష్ట్ర పొలిమేర్ల నుంచి త‌ర‌మికొట్టేవాడంటూ ప‌సుపు త‌మ్ముళ్లు.. సోష‌ల్ మీడియాలో అత్యుత్సాహం క‌న‌బ‌ర‌చుతున్నారు. మ‌రి ఇదంతా చంద్ర‌బాబుకు అర్ధ‌మ‌వుతోందా! లేదా ! అనేది కూడా ప్ర‌శ్నార్ధ‌క‌మే సుమా!

You might also like