ఏపీలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. 2014లో ఎదురుదెబ్బతో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైంది. ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.
2019లో మరింత దారుణ దుస్థితికి జారిపోయింది. నాయకత్వలోపంతో హస్తం కోలుకోవటం కష్టమనే భావన బలపడింది. కాంగ్రెస్ వాదులంతా.. ఇతర పార్టీల్లోకి జంప్ చేయటంతో హస్తం మనుగడ ఇక ప్రశ్నార్ధకమనే విధంగా మారింది. 2019లో టీడీపీ ప్రాభవం తగ్గింది. విపక్ష హోదాలో ఉనికిని చాటుకునేందుకు నానాతంటాలు పడుతుంది.
కమ్మ కులంలో కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొంతమంది మాత్రమే చంద్రబాబు నాయుడును నమ్ముతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు కమ్మకు అంతటి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ నాటి ఎంపీ రాయపాటి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. మొన్నటి ఎన్నికల్లోనూ కమ్మ వర్గం బాబును దూరంగా ఉంచిది. ఫలితంగానే తాడికొండ, మంగళగిరి వంటిచోట్ల కూడా ఓడిపోవాల్సి వచ్చిందనే అభిప్రాయం బలపడింది. ఇప్పుడు చంద్రబాబుకు వయోభారం మీదపడటం.. అంత చురుగ్గా కూడా ఉండలేకపోతున్నారు. ఐదేళ్లపాటు లోకేష్‌బాబు తనకంటూ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు.
కనీస గుర్తింపు కూడా సాధించలేకపోయారు. దీంతో టీడీపీలో బాబు తరువాత ఎవరనేది ప్రశ్నగానే మిగిలింది. దీనికి పరిష్కారం నందమూరి కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పగించటమే అనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వినిపించింది. అది జూనియర్ ఎన్టీఆర్, నారా బ్రాహ్మణి అనేది కూడా పార్టీశ్రేణుల్లో ఇప్పటికీ సాగుతున్న చర్చ అనే చెప్పాలి. నాయకత్వ లేమి.. వైసీపీ బలంగా ఉండటం.. 2024 నాటికి పోటీపడేందుకు అనువుగా టీడీపీ బలపడుతుందా!అనే అనుమానాలు ఉండటంతో టీడీపీ నేతలు చాలా మంది వైసీపీ వైపు దిక్కులు చూస్తున్నారు. కమ్మ కులనేతలు కూడా జగన్‌తో కోరి తలనొప్పులు తెచ్చుకునేందుకు ఇష్టపడట్లేదు.
వ్యాపారాలు, కాంట్రాక్టులు, అనుమతులు దూరమైతే ఆర్ధికంగా తాము నష్టపోతామనేది కమ్మ కులంలోని వ్యాపార, పారిశ్రామిక వేత్తల అంతరంగం.
ఎటుచూసినా టీడీపీను రాబోయే రోజుల్లో ఆర్ధికంగా ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారనేది బహిరంగ రహస్యం. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. గ్లామర్ ఉన్న నాయకుడు.. మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత టీడీపీలో ఎవరనేది మరో ధర్మసందేహం. ఎటువైపు నుంచి చూసినా టీడీపీ మున్ముందు కార్యకర్తలను కాపాడుకోలేక చేతులెత్తేయటం ఖాయమని తెలుస్తోంది. ఇంటా .బయటా ఎదురవుతున్న సవాళ్లతో తెలంగాణాలో కనుమరుగైన తెలుగుదేశం.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతర్థానం కావటం ఖాయమంటూ ఇప్పటికే వైసీపీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. టీడీపీలోని సీనియర్లకూ ఇదే భయంపట్టుకుందట.