FbTelugu

తెలంగాణ ఇంట.. మృత్యు గంట

తెలంగాణ రాష్ట్రంలో మృత్యు గంట మోగుతోంది. ప్రతిరోజూ జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా ప్రభావం తెలంగాణలో మొదట్లో చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడది పూర్తిస్థాయిలో విజృంభిస్తోంది.

ప్రతిరోజూ 30కి పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా చేయిదాటి పోయినట్టుగా కనిపిస్తోంది. గతంలో మరణాలు చాలా తక్కువగా నమోదయ్యేవి. కానీ, అవి కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. కేవలం మూడురోజుల్లోనే 11మంది కరోనా కాటుకు బలయ్యారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది.

అత్యధికంగా కేసులు నమోదయ్యేది కూడా హైదరాబాద్‌ నగరంలోనే. కానీ, సర్కారు మాత్రం టెస్టుల సంఖ్య పెంచడం లేదు. కోర్టులు మొట్టికాయలు వేసినా ఫలితం శూన్యం. సరిగా టెస్టులు చేయకపోవడం వల్లే లక్షణాలు లేని రోగులు బయటపడడం లేదని ఎంతోమంది వైద్యరంగ నిపుణులు నెత్తీనోరు బాదుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణలో ఇప్పటివరకు 45మంది ప్రాణాలు వదిలినా సర్కారు చర్యల్లో మార్పు రావడం లేదని తెలంగాణ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమానితులందరికీ టెస్టులు చేస్తే లక్షణాలు లేకున్నా బయటపడతారని, వారిద్వారా ఇతరులకు వైరస్‌ సోకకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుమానితులకు టెస్టులు చేయకపోవడంతో వారి ద్వారానే ఎక్కువగా సోకుతున్నందున లక్షణాలు లేనివారికి కూడా టెస్టులు చేయాలని అనేకమంది కోరుతున్నారు. లేకుంటే తెలంగాణ మరణమృదంగం మరింత పెరిగే ప్రమాదముందని వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You might also like