FbTelugu

ఏపీకి తెలంగాణ రైట్ రైట్ చెబుతుందా?

లాక్‌డౌన్ ఎలాగూ మే 31వ‌ర‌కు పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌లు సాధ్య‌మ‌వుతాయా.. అన్న చ‌ర్చ అంద‌రిలోనూ నెలకొంది.

ఎందుకంటే తెలంగాణ, ఏపీ మ‌ధ్య దాదాపు రెండు నెల‌లుగా రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దీనివ‌ల్ల హైద‌రాబాద్‌లో ఇరుక్కున్న‌వారు సొంతూళ్ల‌కు వెళ్ల‌లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సొంతూళ్లకు రప్పించాల‌ని నిర్ణయించింది. అయితే అలా వ‌చ్చిన‌వారంతా 14 రోజుల‌పాటు హోంక్వారంటైన్‌లో ఉండాల‌ని నిబంధ‌న వ‌చ్చింది.

అందుకు ఇష్ట‌ప‌డితే త‌మ పేర్లు స్పంద‌న వెబ్‌సైట్‌లో రిజిష్ట‌ర్ చేసుకోవాల‌ని సూచించింది. దీనికి సిద్ధ‌ప‌డి ఏకంగా 13వేల మంది హైద‌రాబాద్‌, చుట్టుప‌క్క‌ల జిల్లాలవాసులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరంద‌రికి హైద‌రాబాద్ నుంచి నేరుగా నాన్‌స్టాప్ బ‌స్సుల‌ను సొంత జిల్లాల‌కు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది.
ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌రిహ‌ద్దులు దాటి బ‌స్సులు వ‌చ్చే విష‌యంలో తెలంగాణ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

దీనివ‌ల్ల రాక‌పోకలు పెరిగి పాజిటివ్ కేసులు పెరుగుతాయ‌ని తెలంగాణ ప్రభుత్వం బ‌స్సుల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. పైగా ఏపీలో కేసులు బాగా పెరుగుతుండంతో అక్క‌డి నుంచి బ‌స్సులు న‌డిపితే ప్ర‌యాణికులు అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తే ఇక్క‌డ కేసులు పెరుగుతాయ‌ని భావించింది. ఏపీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది.

ఈ నెల 13నే బ‌స్సులు న‌డుపుతామ‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించి, తెలంగాణ ప్ర‌భుత్వ అభ్యంత‌రంతో వెన‌క్కి త‌గ్గింది. బ‌స్సుల్లో ప్ర‌త్యేకంగా 3వ‌రుస‌ల సీట్లు పెట్టి ఏర్పాట్లు చేసినా చివ‌రికి బ‌స్సులు హైద‌రాబాద్ వ‌చ్చేందుకు వీలుప‌డ‌లేదు. దీనివ‌ల్ల స్పంద‌న వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకున్న 13వేల మంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎలాగొలా ఇంటికి వెళ్లేందుకు దారి దొరికింద‌ని భావించిన త‌రుణంలో బ‌స్సులు న‌డ‌ప‌డం లేద‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో నిరాశ‌లో ఉన్నారు.

ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ పొడిగిస్తూ ఇచ్చిన నిబంధ‌న‌ల‌లో ఇరు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో బ‌స్సులు నడుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. దీనివ‌ల్ల ఏపీ, తెలంగాణ మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరి హైద‌రాబాద్‌కు బ‌స్సులు తిప్పేందుకు ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సికి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుందా అన్న‌ది చూడాలి. రెగ్యుల‌ర్ బ‌స్సుల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోయినా క‌నీసం స్పంద‌న వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకున్న వారిని తర‌లించేందుకైనా అనుమ‌తి ఇవ్వాల‌ని తెలంగాణ‌ను ఏపీని కోరే అవ‌కాశం ఉంది. మ‌రీ సియం కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి..!!!

You might also like