FbTelugu

తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: ఏపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ ను మించిన దుర్మార్గుడు అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శంచారు. కృష్ణా జలాలపై జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం పై మండిపడ్డారు.
రెండు రాష్ట్రాల మధ్య జలాల సమస్యను సృష్టించిందే ఆంధ్రాసర్కార్ అని, గ్రేటర్ హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందెవరు అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ జగదీశ్ రెడ్డి మీడియతో మాట్లాడుతూ, ప్రాజెక్టుల సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా, జీఓ ల పేరిట చిలకపలుకులు పలుకుతున్నారు. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీఓ ను ఇచ్చారా అని నిలదీశారు. మద్రాస్ కు మంచినీరు సరఫరా పేరుతో వైఎస్.రాజశేఖరరెడ్డి కృష్ణా నీళ్లను దోచుకున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారు. ఏడేండ్ల కరువులోను కృష్ణాడెల్టా కు నీళ్లు వదిలారు. ఎడమ కాలువ గట్టుమీద కన్నా కుడికాలువ కింది భాగంలో ఎక్కువ సాగు ఉందన్నారు. హుకుం లు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారు. ఆడుకుంటాం, వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కుల్ని ఎవరూ హరించ లేరని జగదీశ్ రెడ్డి అన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసం అన్నారు. ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారు. ఇందులో తెలంగాణా ది వీసం ఎత్తు తప్పు లేదన్నారు. తప్పు చేసిన వాళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.