FbTelugu

అత్తమీద కోపం…!

అత్తమీద కోపం దుత్తమీద వెళ్లదీసిందన్న సామెతను నిజం చేస్తున్నారు హైదరాబాద్‌ నగర పోలీసులు. సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది ప్రభుత్వం.

ప్రజలెవరూ గుంపులు గుంపులుగా బయటకు రావద్దని, వాహనాలేవీ రోడ్లమీద తిరగొద్దని చెప్పారు. అయితే, జనం ఎవరూ సోమవారం నాడు ఈ నిబంధనను పట్టించుకోలేదు. పొలోమంటూ ఒక్కసారిగా జనమంతా రోడ్లెక్కారు. లాక్‌డౌన్‌ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఈ విషయం తెలిసిన పోలీస్‌ బాస్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. షట్‌.. ఏమిటీ పరిస్థితి. వారంతా ఇలా ప్రవర్తిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ కిందిస్థాయి పోలీసులపై ఫైర్‌ అయ్యారు.

ఇక, రెగ్యులర్‌గా పోలీస్‌ శాఖలో జరిగేదే జరిగింది. పై స్థాయి వారు కిందిస్థాయిని తిట్టడం.. వారు వారికింద స్థాయి వారిని తిట్టడం.. ఇలా ఒకరిపై ఒకరు తిట్ల దండకం స్టార్ట్‌ అయ్యింది. దీంతో పాపం రోడ్లపై పహారా కాస్తున్న పోలీసులు ఎవరిని తిట్టాలో తెలియక రోడ్డుపైకి వస్తున్న వారిపై వారి కోపాన్ని వెళ్లగక్కారు. లక్కడక్కడా లాఠీలకు కూడా పనిచెప్పినట్టు సమాచారం. అయితే, వారు ఈ అంశంలో ఒక విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించి విమర్శలు మూటగట్టుకున్నారు.
జర్నలిస్టులపైనా దాడులు
ఈ కర్ఫ్యూనుంచి అత్యవసర సేవలు చేసేవారిని మినహాయించారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా చెప్పారు. ఈ అత్యవసర సేవల్లోకే జర్నలిస్టులు కూడా వస్తారని క్లియర్‌గా చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం చాలా ప్రాంతాల్లో జర్నలిస్టులు రోడ్లపై తిరిగేందుకు అనుమతించలేదు. పైగా చాలా దురుసుగా కూడా ప్రవర్తించారు. రాత్రివేళ విధులు ముగించుకొని వస్తున్న జర్నలిస్టులపై దాడులకు కూడా దిగారు.

కర్ఫ్యూనుంచి తమకు మినహాయింపు ఉందని చెప్పి కార్డులు చూపించినా వదల్లేదు. వారి వాహనాలను ఆపేశారు. కొందరిని బండబూతులు తిట్టారు. ఓ పత్రిక స్టేట్‌బ్యూరో ఇన్‌చార్జి

మీద ఏకంగా దాడికే దిగారు. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసన్నలూ.. మీరు చేస్తున్న సేవలు హ్యాట్సాప్‌.. పని ఒత్తిడితో పాటు బాస్‌ల తిట్లతో మీరు అసహనంగా ఉండడం కూడా సహజమే ఇందులో తప్పు కూడా లేదు.

కానీ, కర్ఫ్యూనుంచి మినహాయింపు ఉన్న వారిని వారి కార్డులు చూసి వదిలేయండి సార్‌.. ఎందుకంటే వారు కూడా సరదా కోసం రోడ్లెక్కడం లేదు. ఉద్యోగ బాధ్యతల మేరకే.. అది కూడా బిక్కుబిక్కుమంటూనే రోడ్లపైకి వస్తున్నారు. మీరు చేసినట్టే అనేక ఇబ్బందులు ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారి విధులను వారు నిర్వహించుకునేలా చూడండి సార్‌.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More