FbTelugu

తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్?: మంత్రి శ్రీనివాస్

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేస్తున్నామని, సోమవారం నాడు దీనిపై నిర్ణయం తీసుకుంటామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

ఇవాళ ఒక టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ లో భాగంగా కొన్ని సడలింపులు ఇచ్చామని, దీన్ని అర్థం చేసుకోకుండా కొందరు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని జిల్లాలతో పోల్చితే హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పని ఉన్నా లేకున్నా తిరగడం మూలంగానే కేసులు భయంకరంగా పెరుగుతున్న మాట వాస్తవమేనని మంత్రి శ్రీనివాస్ అంగీకరించారు.

కేసులను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించాలా లేదా అనేది సోమవారం నాడు సీఎం కేసీఆర్ నిర్ణయించి ప్రకటిస్తారని ఆయన అన్నారు. కేసీఆర్ దీనిపై నిపుణులతో చర్చించి కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. పూర్తిగా లాక్ డౌన్ చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో కొన్ని సడలింపులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం నియంత్రించిందన్నారు. అన్ని రాష్ట్రాలు సడలింపులు ఎత్తివేయడంతో తెలంగాణలో కూడా ఎత్తేశామని మంత్రి అన్నారు.

You might also like