FbTelugu

వైఎస్ఆర్ ముమ్మాటికి దొంగే: మంత్రి శ్రీనివాస్

న్యూఢిల్లీ: తెలంగాణలో జనవనరులను, సంపదను దోచుకుతిన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను దొంగ అనక ఏమని అంటామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పరుషపదజాలంతో దూషించారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కూడా అలాగే రాయలసీమకు నీటిని దోచుకుపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ఏపితో సయోధ్యతో ఉందామంటే, నోట్లో చెక్కెర, కడుపులో కత్తెర వైఖరితో ఏపి మంత్రులు ఉన్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్ఆర్ తప్పు చేస్తే, కొడుకు అలా ఉండడని అనుకున్నామన్నారు. తండ్రి చేసిన తప్పులను సరిదిద్దుకుంటాడని జగన్ తో చర్చలు జరిపామని అన్నారు. తెలంగాణ ప్రజల పాలిట నరరూప రాక్షసుడు, దోపిడిదారుడు వైఎస్.రాజశేఖర రెడ్డి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు పెట్టిన దుర్మార్గుడు అన్నారు. వందలాది మంది ఉద్యమకారులను జైలుకు పంపించారన్నారు. మాజీ సిఎల్పీ నాయకుడు, ఎమ్మెల్యే పి.జనార్థన్ రెడ్డి మృతికి వైఎస్ఆర్ కారణం కాదా అన్నారు. తెలంగాణ నాయకుల విగ్రహాలు ఏపిలో ఉండవు కాని, ఏపి నాయకుల విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉంటాయన్నారు. తెలంగాణ మీరే తెచ్చినట్లు, మీరే సాధించినట్లు విగ్రహాలు పెట్టుకున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపిలో పనిచేసే తెలంగాణ అధికారులు, సిబ్బందిని ఇబ్బందుల పాలు చేశారు. ఏపి జలదోపిడిపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తన వైఖరి చెప్పాలన్నారు. ఆయన స్వస్థలం కూడా చిత్తూరు జిల్లా అయినప్పటికీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని మంత్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.