FbTelugu

గాల్వన్ లోయలో అమరుడైన తెలంగాణ కల్నల్

హైదరాబాద్: లద్దాఖ్ లోని గాల్వన్ లోయ వద్ద ఇండియా, చైనా సరిహద్దుల్లో సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఇండియాకు చెందిన ముగ్గురు సైనికులు అమరులయ్యారు.

ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఉన్నారు. సంతోష్‌ ఏడాదిన్నర కాలంగా ఇండియా, చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్ బదిలీ కాగా లాక్ డౌన్ కారణంగా సరిహద్దుల్లోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. 37 సంవత్సరాల వయస్సులోనే కల్నల్ హోదా పొందిన పిన్న వయస్కుడు. లద్దాఖ్ లో ఇన్ ఫాంట్రీ దళానికి కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.

సంతోష్ కు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

ఆర్మీలో చేరాలనే ఉద్దేశంతో సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. అల్లుడు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

colonel mother

ఆనందంగా… బాధగా ఉంది…

నా కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని సంతోష్ బాబు తల్లి మంజుల వ్యాఖ్యానించారు. ఒక తల్లిగా ఉబికివచ్చే కన్నీళ్లతో  బాధగా ఉందన్నారు. దేశం కోసం నా కుమారుడి ప్రాణాలు పోయాయి. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం బాధిస్తుందన్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి…

కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని ఆయన అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని తీసుకురావడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జి.జగదీష్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తీవ్ర విచారం…

సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. న్యూ ఢిల్లీలో ఉన్న సంతోష్ బాబు భార్య సంతోషి తో ఫోన్ లో మాట్లాడానన్నారు. సూర్యాపేటలో ఉన్న అతని తండ్రి ఉపేందర్ తో కూడా మాట్లాడి, వారిని ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి అని కోరానట్లు తెలిపారు.

అమర వీరులకు సెల్యూట్…

వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో మన భద్రతా దళాలకు చైనా సేనలకీ చోటు చేసుకున్న ఘర్షణల్లో మన దళాల నుంచి ముగ్గురు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఉన్నారని తెలిసి బాధపడ్డాను. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.