FbTelugu

తెలంగాణ సీఎంఓ మూసివేత

సీఎంఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్

ఆందోళనకు గురవుతున్న ఐఏఎస్ లు

హైదరాబాద్: తెలంగాణ సీఎంఓ లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

పాత సచివాలయం కూల్చివేస్తున్నందున ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏజీ ఆఫీసు ఎదురుగా ఎన్న పాత మెట్రో రైలు భవన్ లోకి మార్చారు. ఇంతకు ముందు ఈ భవన్ లో మెట్రో రైలు ప్రధాన కార్యాలయం ఉండేది. బేగంపేట కు మారడంతో ఈ భవన్ ను సీఎంఓ కు కేటాయించారు. ఈ భవనంలో సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, స్పెషల్ సెక్రెటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, హరిత హారం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఛాంబర్లు ఉన్నాయి. వీరి వ్యక్తిగత సిబ్బంది కూడా ఇదే భవనంలో పనిచేస్తున్నారు.

ముఖ్య అధికారి పేషీలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. ఆయన కుమారుడు ఇటీవలే మహారాష్ట్ర నుంచి వచ్చాడు. కుమారుడి నుంచి ఆయనకు సంక్రమించినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.

ఇవాళ పాత మెట్రో రైలు భవన్ లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు, అధికారుల నుంచి ఎర్రగడ్డ ఛాతి వైద్యశాల సిబ్బంది నమూనాలు సేకరించారు. ఒకటి రెండు రోజుల్లో రిపోర్టులు రానున్నాయి. అప్పటి వరకు అందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

మెట్రో రైలు భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. తదుపరి సమాచారం ఇచ్చే వరకు ఎవరూ రావద్దని సీఎంఓ అధికారులు అన్ని శాఖల అధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం వచ్చే ఫైళ్లు మొత్తం మెట్రో రైలు భవన్, అక్కడి నుంచి ప్రగతి భవన్ కు వెళ్తాయి. ప్రగతి భవన్ లో ఆమోదం పొందిన తరువాత తిరిగి మెట్రో రైలు భవన్ వస్తాయి.

ఇక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల, ముఖ్య అధికారులు తరచూ ప్రగతి భవన్ లో జరిగే సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాలకు వెళ్లి వస్తుంటారు. వీరి నుంచి ప్రగతి భవన్ లో పనిచేస్తున్నవారికి సోకింది లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రగతి భవన్ లో కరోనా వైరస్ నియంత్రణ కోసం పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.