FbTelugu

బోగస్‌ కార్డులపై నజర్‌!

తెలంగాణ రాష్ట్రంలో బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేత మళ్లీ తెరపైకి వచ్చింది. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్‌ కార్డులు జారీ చేస్తామంటూ సీఎం కేసీఆర్‌ రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. అయితే, కొత్త కార్డులు ఇవ్వడానికి ముందుగా బోగస్‌ కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

వాస్తవానికి కొత్త రేషన్‌ కార్డుల భారం ప్రభుత్వంపై పడకుండా.. కొత్త కార్డులు లబ్ధిదారులకు ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే బోగస్‌ కార్డుల పేరుతో కొన్నింటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఇస్తే ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా బోగస్‌ కార్డులు చెలామణీలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఒకట్రెండు రోజుల్లో సీఎం స్థాయిలో జరిగే సమీక్ష అనంతరం కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 87.56 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా, వీటి ద్వారా 2.8 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన వారు 1.91 కోట్ల మంది ఉన్నారు. రాయితీ బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏటా రూ.2,200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది.రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే బోగస్‌ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీ కోసం సేకరించిన ఐరిస్, వేలిముద్రలతో పాటు ఆధార్‌ కార్డుల జారీకి తీసుకున్న కుటుంబాల వివరాలను కూడా ప్రత్యేక సర్వర్‌ ద్వారా క్రోడీకరించి బోగస్‌ కార్డులను తొలగించింది. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్‌ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి సుమారు 10 లక్షల కార్డులను తొలగించింది. ప్రస్తుతం కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో బోగస్‌ కార్డుల ఏరివేత మళ్లీ కానుంది. రాష్ట్రంలో ఈ ఏడేళ్లలో చనిపోయిన వారు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉన్న వారు సుమారు 8 లక్షల వరకు ఉంటారని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ కార్డులన్నింటినీ ఆధునిక పరిజ్ఞానం ద్వారా తొలగించాలని చూస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.