FbTelugu

వివేకాను ఆ ముగ్గురే హత్య చేశారు: ఎమ్మెల్సీ లోకేశ్

తిరుపతి: మాజీ ఎంపి వైఎస్.వివేకానంద రెడ్డి హత్యకు.. మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. హత్యలో ఎంపి వైఎస్.అవినాష్ రెడ్డి, ఈసి.గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రదారులని ఆయన ఆరోపించారు.

ఇవాళ ఉదయం గరుడ సర్కిల్‍లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిరసన కు దిగారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో నాపై నిరాధార ఆరోపణలు చేశారని, కుటుంబ కలహాలతో వాళ్లే హత్య చేశారన్నారు. వివేకా కుమార్తె సునీత కోర్టుకెళ్లినా, సిబిఐ విచారణ జరగడం లేదని ఆరోపించినా సిఎం వైఎస్.జగన్ ఎందుకు నోరువిప్పడం లేదు? అని నిలదీశారు. వివేకా హత్యతో సంబంధం ఉన్న వ్యక్తులు.. ఒక్కొక్కరుగా చనిపోతున్నారన్నారు. తనపై ఆరోపణలు చేశారని, జగన్‍కు దమ్ముంటే అలిపిరి రావాలన్నారు. రక్త చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసని, కత్తితో వచ్చినోడు ఆ కత్తితోనే పోతాడని లోకేశ్ శాపనార్థాలు పెట్టారు.

వివేకా హత్యపై శ్రీవారి పాదాల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దామని, దమ్మూ ధైర్యం ఉంటే జగన్‍రెడ్డి ఇప్పుడు ఇక్కడికి రావాలని సవాల్ విసిరారు. నేను ఇంకో గంటసేపు ఇక్కడే వేచిచూస్తానన్నారు. జగన్‍రెడ్డి తన ఇంటినుంచి బయలుదేరితే 45 నిమిషాల్లో అలిపిరికి రావొచ్చన్నారు. అటు జగన్‍రెడ్డి ఉంటాడు.. ఇటు నేను ఉంటా.. ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటామన్నారు. మా కుటుంబానికి చిత్తశుద్ధి ఉంది.. మేం మాటమీద నిలబడతామన్నారు. బాబాయి వివేకానంద రెడ్డిని వివ హత్యచేసిన వారిని పట్టుకోవాలని జగన్‍కు లేదా? ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో హత్య జరిగితే సిబిఐ విచారణ కోరిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత సిబిఐ విచారణ పూర్తి చేయించకుండా అడ్డుపడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. నిరసనలో ఏపీ టిడిపి అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే రామానాయుడు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.