FbTelugu

బిడ్డలకు మోసం, కొడుక్కి మద్దతా?: టిడిపి

తిరుపతి: కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే లేఖల పేరుతో వైఎస్.విజయలక్ష్మీ ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు.
తన తండ్రి వైఎస్.వివేకానందరెడ్డిని చంపిన నిందితులను శిక్షించాలని రెండు ఏళ్లుగా డాక్టర్ సునీతారెడ్డి చేస్తున్న ఆందోళన మీకు ఇవాళ కనిపించిందా? అని ఆయన నిలదీశారు. మాజీ ఎంపి వివేకా హత్య కేసులో న్యాయం చేయని జగన్ రెడ్డిని వదలిపెట్టి, వాస్తవాలు రాసిన మీడియాను తప్పు పట్టడం మీ కుటిల నీతికి నిదర్శనం కాదా? అని దెప్పిపొడిచారు. విజయలక్ష్మీ బహిరంగ లేఖలు రాయటం కాదు, నిందితుల్ని కాపాడుతున్నందుకు జగన్ ను నిలదీయాలని, మందలించాలని అన్నారు. తిరుపతి ఎన్నికల్లో మీ కుమారుడి బండారం బయటపడుతుందని ఈ లేఖలు రాస్తున్నారు తప్ప మరోటి కాదని ఎమ్మెల్సీ రాజు అన్నారు.

జగన్ ఒక చెల్లిని మోసం చేసి హైదరాబాద్ లో వదిలేశారు, మరోక చెల్లిని డిల్లీలో వదిలేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ఎద్దేవా చేశారు. మీ కుమార్తెలకు న్యాయం చేయలేని జగన్ ని మీరెందుకు మద్దతిస్తున్నారని, ఎందుకు నిలదీయటం లేదని అన్నారు. వివేకా హత్యపై నాడు సీబీఐ విచారణ కావాలన్న జగన్ ఇప్పుడు సిఎ అయిన తరువాత విచారణను ఎందుకు ముందుకు కదలనివ్వడంలేదో సమాధానం చెప్పాలన్నారు. సిట్ విచారణ వేగంగా జరుగుతుంటే దాన్ని అడ్డుకుంది మీ జగన్ కాదా? అని సూర్యప్రకాశ్ నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.