FbTelugu

ఇవేం హామీలురా బాబూ..!

ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు, అభ్యర్థులకు ఓటర్లకు హామీలు ఇవ్వడం మామూలే. కొన్ని పార్టీలు రైతులకు రుణమాఫీ ఇస్తామని చెబితే.. ఇంకొకరు మహిళలకు పావలా వడ్డీకే రుణాలిస్తామని హామీలు ఇచ్చారు. కొందరు ప్రతి ఇంటికీ టీవీ, మిక్సర్లు, గ్రైండర్లు ఇలా ఎవరికి తోచిన హామీలు వారు ఇస్తూనే ఉంటారు.

అందులో కొన్ని అమలు కూడా చేస్తుంటారు. ఇలా హామీలతో ఓటర్లను ఆకట్టుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తుంటారు. కానీ, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కొన్ని రకాల హామీలు ఇస్తుంటారు. వాటిని చూస్తే నవ్వు వస్తుంటుంది. అసలు ఆ హామీలు నెరవేర్చగలిగేవేనా అన్న ఆలోచన కూడా వారికి ఉండదు. వాటిని అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలో కూడా తెలియదు. కానీ, నోటికొచ్చినట్టు హామీలు ఇస్తూ పోతుంటారు. గెలిచిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు. అప్పటికైతే గెలిచాము కదా అన్న తీరులో కొందరు నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి హామీలే ఇస్తున్నారు కొందరు నేతలు. ఒక అభ్యర్థి దేశమంతా నిర్ఘాంతపోయేలా హామీ ఇచ్చాడు. అదేంటంటే తనను గెలిపిస్తే ఇంటికో హెలికాప్టర్‌ ఇస్తాడట. అంతేకాదు.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు.

తమిళనాడు ఎన్నికల్లో ఇలాంటి ఆల్‌ఫ్రీ హామీలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా ఇండిపెండెంట్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. తమిళనాడులోని ఆంథియర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న షేక్‌ దావూద్‌ సరికొత్త వాగ్దానం చేశాడు. తనని గెలిపిస్తే ప్రతి ఇంటికీ రూ.10లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అంతేకాదండోయ్‌.. ఒక్కో ఇంటికి రూ.25వేల నగదు, ప్రతిరోజూ ఒక ఫుల్‌బాటిల్‌ ఇస్తానని హామీ ఇచ్చాడు. మధురైలోని మరో అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి పనిచేసేందుకు ప్రతి ఇంటికీ ఒక రోబోను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇలా ఎవరికి వారు ఏమాత్రం తీసిపోకుండా నమ్మశక్యం కాని హామీలతో ఎన్నికల ప్రచారాన్ని రసవత్తరంగా చేస్తున్నారు. మరి ఇలాంటి హామీలను ఓటర్లు ఎంతవరకు నమ్ముతారో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.