FbTelugu

తలైవా తప్పుకుంటే..!

తమిళ సూపర్‌స్టార్‌ తలైవా రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించాడు. వాస్తవానికి రజనీకాంత్‌ కాంగ్రెస్‌లో చేరాలని ఒకప్పుడు నిర్ణయించుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ఆయనే రాజకీయ పార్టీని స్థాపిస్తారన్న ప్రచారం చాలా సంవత్సరాల పాటు సాగింది. కానీ, ఆ భాషా దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, పార్టీ పెట్టడం ఖాయం అన్న ప్రచారం మాత్రం జోరుగా సాగింది. రెగ్యులర్‌గా ఆయన తన అభిమాన సంఘాలతో చర్చలు జరపడం పార్టీ స్థాపిస్తారన్న వార్తలకు బలం చేకూర్చింది. చివరకు ఇటీవల ఆయన పార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరును కూడా వెల్లడించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని ప్రకటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు జరుగుతాయని అందరూ భావించారు. కానీ, ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొత్త విషయాలు ఏమైనా చెబుతారేమోనని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూశారు.

కానీ, ఆయన తాను రాజకీయ పార్టీని పెట్టడం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయ పరిణామాల్లో అనేక మార్పులకు అవకాశం ఏర్పడినట్టయింది. వాస్తవానికి రజనీకాంత్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరో సినీ నటుడు కమల్‌హాసన్‌ ముందుకు వచ్చారు. రజనీ, కమల్‌హాసన్‌ పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కొంటాయని అంతా భావించారు. ఈ రెండు పార్టీలు కలిస్తే ఏఐఏడీఎంకేతో పాటు బీజేపీకి కూడా చుక్కలు కనిపిస్తాయని కొందరు భావించారు. కొందరు మాత్రం రజనీకాంత్‌ బీజేపీకి మిత్రుడేనని, బీజేపీని గెలిపించేందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నాడన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే, ఇప్పుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాకపోవడంతో తమిళనాడులో ఎవరికి కలిసి వస్తుంది.. ఎవరికి నష్టం జరుగుతుంది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆయన ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని, దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందని.. అందుకే ఆయన బరినుంచి తప్పుకున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం రాజకీయాల్లో తాను రాణించలేనన్న నిజాన్ని తెలుసుకున్నారని.. ఇటీవల వచ్చిన సర్వే రిపోర్టులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తన గౌరవాన్ని కోల్పోవడం ఎందుకన్న భావనలో రాజకీయాల నుంచి తప్పుకున్నారన్న వాదన కూడా వ్యక్తమవుతోంది. అయితే, రాజకీయాల్లోకి రావడం లేదన్న తలైవా ప్రకటనతో ఎవరికి ఎంత లాభం.. ఎవరికి ఎంత నష్టం అన్నదే ఇప్పుడు తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.