FbTelugu

ఏసీబీ కి పట్టుబడిన తహశీల్దార్ ఏజెంట్

Tahsildar-demanded-Rs-4-lakh

కర్నూలు: భూ సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి తహశీల్దార్ రూ.4 లక్షలు డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గూడూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం తహశీల్దార్ హసీనాబీ ని నెల క్రితం కార్యాలయంలో సంప్రదించాడు. అయితే ముటేషన్ కోసం తనకు రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని తహశీల్దార్ డిమాండ్ చేసింది. అగ్రిమెంట్ ప్రకారం ముందుగా రూ.4 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీంతో కలత చెందిన సురేష్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ తర్వాత తహశీల్దార్ కోరిన మేరకు రూ.4 లక్షలు తీసుకొని గురువారం రాత్రి పాణ్యం బస్ స్టాండ్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే ఎమ్మార్వో తాలూకు వ్యక్తి మహబూబ్ భాష అనే వ్యక్తి సురేష్ నుంచి సొమ్ము తీసుకునే యత్నంలో ఉండగా, అక్కడ మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సిబ్బంది మహబూబ్ భాషను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మార్వో ఆదేశించిన మేరకు ఆ సొమ్మును తీసుకునేందుకు వచ్చినట్లు మహబూబ్ బాషా ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన తప్పేమి లేదని, తహశీల్దార్ ఆదేశం మేరకు మధ్యవర్తిగా వచ్చానని తెలిపాడు. ఈ ఘటన తర్వాత హసీనా బి ని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు యత్నించగా విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే ఇంటి నుంచి పరారైంది.

You might also like