FbTelugu

త్వరలో రైతులకు స్వీట్ న్యూస్: సీఎం కేసీఆర్‌

సిద్దిపేట: యావత్ దేశంలోనే అద్భతమైన పథకం రైతుల కోసం ఆలోచన చేశామని, వారం రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ కోసం ఎంత మొండిగా ఉద్యమం చేశానో, ప్రత్యేక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కూడా అంతే శ్రమించానని అన్నారు. ఉద్యమ సారధిగా, ముఖ్యమంత్రిగా తన జీవితంలోఅద్భుతమైన ఘట్టం పూర్తయిందని అన్నారు. కొండపోచమ్మ సాగర్ లో గోదావరి జలాలను వదిలిన సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

గోదావరి జలాల రాకతో తెలంగాణ రైతాంగం సమస్యలు చాలా వరకు మటుమాయమని, మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం ఒక పథకం రూపొందించానని అన్నారు. గోదావరి జలాల ఆనందంలో మనందరం ఉన్నామని, వారం రోజుల తరువాత ఆ తీపి కబురు ప్రకటించి రైతు సోదరులకు భరోసా కల్పిస్తానన్నారు.

నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు అని స్పష్టం చేశారు. నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయన్నారు. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 530 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుంది. గోదావరి జలాల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని తెలంగాణ అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించి.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని సీఎం వివరించారు.

You might also like