FbTelugu

టీటీడీ ఆస్తులు అమ్మకాల్లో స్వామి కీలకపాత్ర

దేవాదాయ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం

ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక

గుంటూరు: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దాతలు ఇచ్చిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారం టీటీడీ బోర్డు అమ్మడాన్ని ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండించింది.

సోమవారం ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడారు. ఈ భూముల అమ్మకాల్లో విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానంద కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఆయన పీఠం లోనే ఆస్తుల అమ్మకానికి సంబంధించి చర్చలు జరిపారని అన్నారు. దానిలో భాగంగానే రిషికేశ్ లో 40 సెంట్ల విలువైన భూమిని స్వామి స్వరూపానంద కు కట్టబెట్టే కుట్ర దాగుందని అన్నారు.

ప్రముఖ తెలుగు సినీనటి కాంచన రూ.15 కోట్ల విలువ చేసే తన సొంత ఆస్తిని స్వామివారికి 2010లో అప్పటి ఈఓ పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు చేతుల మీదుగా స్వామివారికి అందజేయటం జరిగిందన్నారు. ఈ ఆస్తిని కూడా అమ్మకానికి పెట్టడం పై ఐవైఆర్ కృష్ణారావు నోరుమెదపాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామి స్వరూపానంద గత ప్రభుత్వాలలో టీటీడీ అంశాలపై నానాయాగీ చేసేవారిని, ప్రస్తుతం రచ్చ జరుగుతుంటే నోరు ఎందుకు మెదపడం లేదని ఆయన నిలదీశారు.

వెంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగించేలా స్వామి వారి అపురూప ప్రసాదమైన తిరుమల లడ్డూలను స్వామి వారికి నైవేద్యం కూడా సమర్పించకుండా విక్రయిస్తున్నారన్నారు. భక్తులు స్వామి వారిని దర్శించకుండానే బయటికి తీసుకు వచ్చి స్వీట్ షాప్ లో మిఠాయిలు అమ్మినట్లు గా స్వామి వారి కైంకర్యానికే అత్యంత అవమానకరం అన్నారు. గతంలో కూడా కోటానుకోట్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక నాయకడు ప్రవర్తించాడన్నారు. ఏడుకొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న రాష్ట్ర మహానేతకు, వేయికాళ్ల మండపం కూల్చివేసిన అధినేతకు ఎటువంటి శిక్షలు విధించారో అందరికీ తెలిసిందేనన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కుటుంబం ఏనాడైనా తమకున్న కోట్ల ఆస్తులలో ఒక సెంటు భూమిని దానం ఇచ్చారా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పెద్ద దేవాలయ ఆస్తులు అమ్మితే తదుపరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కు సంబంధించిన ఆస్తులన్నింటినీ అమ్ముకోవచ్చని వ్యూహ రచన చేశారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు వడ్డమాను ప్రసాదు, గుంటుపల్లి అజిత్ శర్మ, మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు, సుబ్రహ్మణ్య శర్మ, యజ్ఞ నారాయణ పాల్గొన్నారు.

You might also like