ఏపీ మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై బుధవారం విచారణ వాయిదా పడింది.
దీనిపై తుదితీర్పు వెలువడుతుందా! మరో సారి వాయిదా వేస్తారా అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నపుడు ఎన్నికల అధికారిగా నియమించిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ఐదేళ్లపాటు పదవీలో కొనసాగే వీలుంది. అయితే ఈ నేపథ్యంలోనే లోకల్ ఎన్నికలు ముంచుకొచ్చాయి.
అసలే చంద్రబాబు నియమించిన వ్యక్తి.. ఏదోమూలన వైసీపీ శ్రేణులకు అనుమానం ఉండగానే కరోనా వ్యాప్తితో ఎన్నికలను వాయదావేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేనా సీఎం ఆయనా.. అంటూ జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతేలే.. చంద్రబాబు రుణం తీర్చుకోవాలనే ఇదంతా చేశాడంటూ ఏతా..వాతా ఆలోచించి నిమ్మగడ్డను తొలగించేందుకు చట్టసవరణ చేశారు.
ఎక్కడో తమిళనాడులో ఉన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్ గా నియమించాడు నిమ్మగడ్డ ఇక నువ్ ఇంటికెళ్లు అన్నట్టు కొట్టకుండానే అన్నంత పనిచేశాడు. అసలే ఐఏఎస్ అధికారి.. అంతే నాకూ చట్టాలు తెలుసంటూ హైకోర్టుకు ఎక్కాడు. కానీ.. వైసీపీ వైపు ఉన్న న్యాయకోవిదులు కూడా ఇదంతా ట్రాష్. అసలు మేము నిమ్మగడ్డను తొలగించలేదు.
ఏదో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాం. దానిలో నిబంధన ప్రకారం మూడేళ్లు పూర్తయిన నిమ్మగడ్డకు పదవీవియోగం తప్పలేదంటూ కోర్టుకు నివేదించారు. నిమ్మగడ్డ కూడా, చూశారా.. అసలు రాజ్యాంగంలో లేని అంశాలను చూపుతూ నాపై కావాలనే కక్షసాధించాంటూ న్యాయస్థానం వద్ద విన్నవించాడు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. మరి తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది సస్పెన్స్. ఒకవేళ ఎవరికి ప్రతికూలంగా తీర్పు వచ్చినట్టుగా అనుకున్నా.. వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలూ లేకపోలేదు సుమా!