FbTelugu

ఇక సామాజిక మాధ్యమాల్లో నోటీసులు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇకనుంచి కోర్టులు సమన్లు, నోటీసులు వాట్సాప్​, ఈ-మెయిల్​, ఫ్యాక్స్​ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అందజేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో కక్షిదారులు, న్యాయవాదుల ఇబ్బందులను సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించేందుకు న్యాయస్థాన కార్యకలాపాలకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించింది. కోర్టు నోటీసులు, సమన్లు, వాదనలకు సంబంధించిన ప్రతులు పంపేందుకు పోస్టాఫీసులకు వెళ్లడం సాధ్యం కాదని తమ దృష్టికి వచ్చిందని, ఇక మీదట అటువంటి సేవలను అందజేసేందుకు ఈ-మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్‌, టెలిఫోన్‌ మెస్సేజింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

బ్లూటిక్స్ ద్వారా నిర్ధారణ:

నోటీసు అందిన వ్యక్తి దాన్ని చూసినట్టు రెండు నీలి రంగు టిక్‌ మార్క్‌లు వాట్సాప్‌ ద్వారా తెలుస్తుందని నోటీసులు జారీ చేయడం గురించి జస్టిస్‌ ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే మే నెల నుంచి పిటిషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.