FbTelugu

హైదరాబాద్ నుంచి విదేశాలకు వ్యాక్సిన్ల సరఫరా

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 వ్యాక్సిన్లను తరలించే ప్రక్రియలో ఎదురయ్యే రవాణా సమస్యలను పరిష్కరించడంలో భాగంగా మొదటి ప్రయత్నం మొదలైంది. వ్యాక్సిన్ల సరఫరా ఒప్పందంపై జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సంతకాలు చేశాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో గ్లోబల్ హబ్ అయిన హైదరాబాద్, గ్లోబల్ ఎయిర్ కార్గో హబ్ అయిన దుబాయ్‌ల ప్రత్యేక భాగస్వామ్యంలో సరఫరా నిర్వహించనున్నారు.

వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా, సమర్థవంతంగా తరలించడంలో హైదరాబాద్-దుబాయ్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను గ్లోబల్ గేట్‌వేగా మార్చేందుకు ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను, ఫార్మా పరిశ్రమలను కలిగి ఉన్న భారత్ కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కూడా చాలా వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. భారత్ నుంచి తయారయ్యే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందని భావిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో హైదరాబాద్‌ విమానాశ్రయానికున్న కనెక్టివిటీ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మరియు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో మరియు దుబాయ్ విమానాశ్రయాలు కలిసి హైదరాబాద్-దుబాయ్ గ్లోబల్ వ్యాక్సిన్ కారిడార్((HYDXB-VAXCOR) అనే ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్, హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్ కుమార్, కమర్షియల్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ఈవీపీ యూజీన్ బారీ కలిసి ఒక వర్చువల్ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం వల్ల కస్టమైజ్డ్, సరళీకృత ప్రక్రియల ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుండి విమానాశ్రయం, అక్కడి నుంచి హబ్ లాజిస్టిక్స్, అటు నుంచి ఎండ్-కస్టమర్లకు వ్యాక్సిన్ల డెలివరీని క్రమబద్ధీకరించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా పరస్పర టెక్నాలజీ సహకారాన్ని కూడా అందించుకుంటారు. ఈ ఒప్పందం కింద రెండు సంస్థలు ఒక సమగ్ర ఐటి సొల్యూషన్‌పై కలిసి పని చేస్తాయి. దీని వల్ల వినియోగదారులకు HYD, DXB మధ్య మరియు వివిధ ప్రపంచ గమ్యస్థానాలకు రవాణా అయ్యే కార్గో మరియు వ్యాక్సిన్ల ఉష్ణోగ్రత, వాటి ట్రాకింగ్‌తో సహా ఎండ్-టు-ఎండ్ సేవలు అందుతాయి. ఈ ఒప్పందం పట్ల ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. భారతదేశం నుంచి వ్యాక్సిన్ ఎగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఎప్పుడూ ఒక ముఖద్వారంగా ఉంటూ వచ్చిందన్నారు. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్లను సురక్షితంగా, సమర్థవంతంగా రవాణా చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక, సహకారాలు అవసరం. అందుకే కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడం కోసం మేము దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌తో “HYDXB-VAXCOR” ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. కోల్డ్ టు అల్ట్రా-కోల్డ్ ఉష్ణోగ్రత పరిధులు అవసరమైన కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం మా సామర్థ్యాన్ని గణనీయంగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.