FbTelugu

జగన్ ‘మిషన్‌ బిల్డ్’ పై సుజయ ధ్వజం

Sujaya-Fire-on-Mission-Build

అమరావతి: పేదలకు ఇవ్వడానికి ప్రైవేట్‌భూములు కొనాలంటున్న జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ భూముల్ని తనవాళ్లకు ఎలా కట్టబెడుతాడు?. సంపద సృష్టించడం చేతగాక, ఆస్తుల అమ్మకానికి పూనుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు విమర్శించారు. ‘మిషన్‌బిల్డ్‌’ ఏపీ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వభూములను అమ్మకానికిపెట్టి, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదల ఇళ్లస్థలాలకు ఇవ్వడానికి స్థలాలు లేవంటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, సర్కారుభూములను అప్పనం గా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే తతంగానికి తెరతీసిందన్నారు. ‘మిషన్‌బిల్డ్’ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వభూముల్ని కట్టబెట్టడానికి వైసీపీ సర్కారు ఉత్సాహం చూపడం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయాంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని చెప్పి, వేలాదిఎకరాల ప్రభుత్వభూముల్ని అప్పనంగా కాజేసిన వాన్‌పిక్‌ లాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చేతగాలేదన్నారు. ప్రైవేట్‌భూములు కొనుగోలుచేసి, పేదలకు ఇస్తామంటున్న ప్రభుత్వం, ప్రభుత్వభూముల్ని ప్రైవేట్‌వ్యక్తులకు అమ్మాలని చూడటం జగన్‌ తుగ్లక్‌ చర్యల్లో భాగమేనని రంగారావు దుయ్యబట్టారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం సృష్టించలేని వైసీపీసర్కారు, చివరకు ప్రభుత్వభూముల అమ్మకానికి పూనుకుందన్నారు.

You might also like