FbTelugu

ఏపీలో రేషన్ డీలర్ల మెరుపు సమ్మె

విజయవాడ: తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు పంపిణీ ని నిలిపివేస్తున్నట్లు డీలర్ల ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ఎనిమిదో విడత రేషన్ పంపిణీ కి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా ప్రజలకు అందే పరిస్థితి లేదు. రేషన్ షాపులకు వచ్చిన పేద ప్రజలు వెను తిరుగుతున్నారు. సమ్మె పై ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు మాట్లాడుతూ, కరోనా కష్ట కాలంలో పేదలకు రేషన్ పంపిణీ చేశామన్నారు. ఏడు విడతలుగా పంపిణీ చేస్తే.. రెండు‌ విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరుగురు రేషన్ డీలర్లు కరోనాతో మరణిస్తే కనీసం ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ఒక్కో వితడతలో కోటిన్నర మంది చొప్పున నెలలో మూడు కోట్ల మందికి రేషన్ ఇచ్చామని ఆయన తెలిపారు. కరోనా రక్షణ పరికరాలు ఇవ్వకున్నా.. బాధ్యత తో పని చేశామని ఆయన అన్నారు. కరోనా వారియర్స్ గా మమ్మలను గుర్తించి మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రల నిబంధన ఎత్తి వేయాలని కోరారు.
గుజరాత్ లో 25లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వగా, ఒడిశాలో వేలి ముద్రల విధానాన్ని ఎత్తేశారని అన్నారు. మా సమస్యల పై అధికారులను కలిసి విన్నవిస్తే.. అవమానించేలా మాట్లాడారని వెంకట్రావు అన్నారు. సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేసే వరకు దుకాణాలు తెరిచేది లేదని ఆయన స్పష్టం చేశారు.. ప్రభుత్వం మొండిగా ఉంటే.. ఆమరణ దీక్షలకు సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు.
మా రేషన్ డీలర్ ల పోరాటాన్ని నీరు గార్చేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అసోసియేషన్ ప్రకటనలు తప్ప.. ఎవరి మాటలు నమ్మవద్దని వెంకట్రావు కోరారు.

You might also like