FbTelugu

లాక్ డౌన్ కఠినంగా అమలు: కెసిఆర్

వరంగల్: రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డిజిపి, పోలీసు అధికారులను ఆదేశించారు.

వరంగల్ సెంట్రల్  జైలు ను తరలించి అక్కడ మాతా శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, విశాలమైన స్థలంలో జైలును నిర్మిస్తామని సిఎం తెలిపారు. కెసిఆర్ శుక్రవారం వరంగల్ లో పర్యటించారు. హెలీకాప్టర్ లో వరంగల్ చేరుకున్న సిఎం, తొలుత ఎంజిఎం లో ఐసియూలో, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను కెసిఆర్ ఆదేశించారు.

video conference

ఆ తరువాత వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు, డిజిపి, ఎస్పి,  పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి?  అని అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ వారం పదిరోజుల్లో పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ  రాష్ట్ర ఆదాయం గురించి ఆలోచించకుండా లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజమెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డిజిపి తో సహా జిల్లా కలెక్టర్లకు ఉన్నదన్నారు. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాలి. అత్యవసర సేవలను, పాస్ లు ఉన్నవాళ్ళని మినహాయించి,  ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదన్నారు. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలని సిఎం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

mlas meeting

కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయం ముగిశాక ఉదయం 10 గంటల తర్వాత పాస్ హోల్డర్స్ తప్ప మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డిజిపి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది?, ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది? అని సీఎం ఆరా తీశారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సిఎం సూచించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిహెచ్ఎంసీ కమిషనర్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. సూపర్ స్ర్పెడర్స్ (ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్ మెన్) తదితరులందరినీ గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లా కలెక్టర్లను కోరారు.  వీరందరికీ వ్యాక్సినేషన్ చేసే విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని కెసిఆర్ ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.