కొలకతా: కాళీ మాత దీవెనలే తనను ఈరోజు రక్షించాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా అన్నారు. అమ్మవారి కృప వల్లే ఈ రోజు సమావేశానికి హాజరు కాగలిగానని ఆయన పేర్కొన్నారు.
తన కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి తరువాత నడ్డా డైమండ్ హార్బర్ లో సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఇవాళ్టి దాడిని చూస్తుంటే రాష్ట్రంలో అటవిక రాజ్యం కొనసాగుతుందని అర్థమైందని, గుండా రాజ్యాన్ని కొనసాగనివ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ దాడిలో ముకుల్ రాయ్, కైలాశ్ విజయ్ వర్గీయ గాయాలపాలయ్యారు.
ప్రజాస్వామ్యానికి ఇది సిగ్గు చేటని, నా వెంట ఉన్న వాహనాలన్నింటిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.అదృష్టవశాత్తు నేను బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఉన్నాను కాబట్టి సురక్షితంగా బయటపడ్డాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ నడ్డా డైమండ్ హార్బర్ సమావేశానికి వెళ్తుండగా కాన్వావ్ పై కొందరు రాళ్ల దాడి చేశారు. ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేసి దాడి చేస్తున్నా కనీసం నిలువరించలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలే దాడులకు దిగారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కేంద్రానికి లేఖ రాశారు.
ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. భద్రతా లోపాలపై బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. వెంటనే నివేదిక ఇవ్వాలని, ఈ ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని కేంద్ర హోం శాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ జగదీప్ ధన్కర్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.