గుంటూరు: రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పవర్ లేని మంత్రి అని, సీఎం జగన్ లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అది డూడూ బసవన్నలా పనిచేస్తుందని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
ఇవాళ నరసరావుపేట లో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ, ప్రేమించలేదని అనూషను హత్య చేసిన నేరగాడు విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అనే రెండక్షరాలు ఉంటే హోం మంత్రి, పోలీసులు వణికిపోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. రెడ్డి అనే తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకం అయినా చేయవచ్చా అని ఆమె ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు నుంచి సాక్షి దినపత్రిక, ఛానల్ లో నిందితుడి పేరు పక్కన రెడ్డి తోక తీసేసి రాస్తున్నారని అని అన్నారు.
బాధితురాలు అనూష తల్లిదండ్రులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. అనూష హత్యవిషయం లో మాకు పలు అనుమానాలు ఉన్నాయి. విద్యార్థి తల్లిదండ్రులను పోలీసులు అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారన్నారు. జగన్ పాలనలో వరలక్ష్మి, తేజశ్విని ఇలా ఏంతో మంది విద్యార్థుల మాన, ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. పోలీసు వ్యవస్థ అంటే నేరస్తుల్లో భయం లేకుండా పోయిందని, రెడ్డి కులం వారికి లెక్కలేకుండా పోయిందన్నారు. దిశ చట్టం ఓ దిక్కుమాలిన చట్టమని, చట్టబద్దత తీసుకు రావటం చేతగాని చవట దద్దమ్మ జగన్ అని అనిత తీవ్రంగా విమర్శించారు.
ఆడపిల్ల ప్రాణానికి రూ.10 లక్షలు వెలకట్టి కేసును నీరుగార్చటానికి ప్రయత్నిస్తున్నారు. సంబంధం లేని అంశాలపై స్పందించే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనూష విషయంలో మౌనం పాటిస్తున్నారన్నారు. స్పందిస్తే సీఎం జగన్, సలహాదారు సజ్జల ఎక్కడ బెదిరిస్తారోనని నోరు మూసుకున్నారని అనిత ఆరోపించారు. ఆయన ఎక్కడ ఉన్నాడో పాపం..? నీ నియోజకవర్గానికి చెందిన ఆడపిల్ల మానం, ప్రాణం అంటే మీకు లెక్కలేదా..?? అని నిలదీశారు. హంతకుడు విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టే కదా వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవ్వరూ అనూష హత్యపై చిన్న స్టేట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.