ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని క్రమశిక్షణలో ఉంచే పోలీస్ శాఖకు మంత్రి, కరోనా నియంత్రణలో నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీస్‌శాఖకు బాస్. మరి.. ఆయనే నిబంధనలు ఉల్లంఘించి ఉన్నతాధికారుల ప్రాణాలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే.. అలాగే ఆ మంత్రి ప్రవర్తన ఉందన్న విమర్శలు సర్వత్రా నిపిస్తున్నాయి.తెలంగాణలో ప్రజాప్రతినిధులకు కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌కు ఈ మహమ్మారి అంటుకుంది. దీని నివారణకు సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కరోనా సోకిన వారు బయట తిరగవద్దని, హోం క్వారంటైన్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలా ఉండని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది.
అలాంటి నిర్ణయాలు తీసుకునే మంత్రివర్గంలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వాటిని తుంగలో తొక్కి బాహాటంగా బయట తిరగడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహమూద్ అలీ వద్ద పనిచేసే సిబ్బందికి కరోనా సోకడంతో ఆయన కొంతకాలంగా హోం క్వారంటైన్లో ఉన్నారు. అయితే, నాలుగు రోజుల క్రితం ఆయన ఇంటినుంచి బయటకు వచ్చారు. అంతేకాదు.. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి గోషామహల్లో నిర్వహించిన హరితహారం కార్య్రకమంలో పాల్గొన్నారు. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు రిపోర్టులో తేలింది. ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో హరితహారంలో ఆయనతో పాటు పాల్గొన్న వారంతా ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు. ఇప్పటికే పోలీసు శాఖలో అనేకమందికి కరోనా సోకింది. ఆ డిపార్ట్మెంట్ అంతా అదే టెన్షన్లో ఉంది. ఇప్పుడు ఆ శాఖ మంత్రి ద్వారా ఎంతమంది ఉన్నతాధికారులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. హోం క్వారంటైన్లో ఉన్న మంత్రి ఇలా జనాల్లోకి ఎలా వస్తారని, ఇదే పని వేరెవరైనా చేస్తే ఊరుకుంటారా అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారూ మీకిది తగునా అంటూ నెత్తి బాదుకుంటున్నారు.