FbTelugu

బిసిలకు ఎస్టి కులం సర్టిఫికెట్లు

అమరావతి: డబ్బులకు ఆశపడి అనర్హులకు ఎరుకుల(ఎస్టి) కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన 9 మంది అధికారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశింది. ఈ మేరకు ఏపి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
లోకాయుక్త ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ ఎదుర్కొంటున్న వారిలో నలుగురు తహసీల్దార్లు, ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో గతంలో 26 మంది బిసిలకు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు.

ఇది అన్యాయం అంటూ ఒక వ్యక్తి ఏపి లోకాయుక్తలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విచారించాల్సిందిగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ శాఖను ఆదేశించింది.
తొలుత ఏలూరు ఆర్డీఓ నేతృత్వంలో విచారణ, ఆ తర్వాత జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి పరిశీలనా కమిటీ విచారించింది. ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖకు నివేదించింది. వారు కూడా విచారణ చేయగా బిసి జాబితాలో వారికి ఎస్టి ధృవీకరణ పత్రాలు ఇచ్చారంటూ తేల్చారు. నాచగుంట గ్రామంలో 26 మందికి జారీ చేసిన ఈ పత్రాలను రద్దు చేయాలంటూ జెసి నేతృత్వంలోని కమిటీ ఏకగీవ్రంగా తీర్మానించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని లోకాయుక్త ఆదేశించింది. దీంతో రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులను గుర్తించి విచారణకు ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.