FbTelugu

వారికి మార్కులే మార్కులు!

కరోనా ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా పడింది. సరిగ్గా వార్షిక పరీక్షల సమయంలో అది విజృంభించడంతో పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. అసలు పరీక్షలు జరుగుతాయా లేదా అన్న విషయంలో విద్యార్థులు చాలా గందరగోళానికి, టెన్షన్‌కు గురయ్యారు.

చివరకు తెలంగాణలో టెన్త్‌ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని సర్కారు తేల్చేసింది. పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులందరినీ ఇంటర్‌కు ప్రమోట్‌ చేసింది. అయితే, వారు ఇప్పటికే పాఠశాలల్లో 20 మార్కులకు నిర్వహించే అసెస్‌మెంట్‌ పరీక్షలను పూర్తిచేశారు. ఈ మార్కులను విద్యార్థులు చదువుతున్న పాఠశాల టీచర్లే వేస్తారు. ఇప్పుడు సర్కారు ఆ మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించింది. అయితే, సాధారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు తమ విద్యార్థులు ఎక్కువమంది అత్యధిక మార్కులు సాధించారని చెప్పుకునేందుకు అసెస్‌మెంట్‌ పరీక్షల్లో వారి విద్యార్థులకు 20కి 20 మార్కులు వేస్తుంటారు.

ఈసారి కూడా అదేవిధంగా జరిగింది. ఇప్పుడు సర్కారు ఆ మార్కులను తీసుకొని దానిని 5రెట్లుగా గుణించి గ్రేడుగా నిర్ణయించనున్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి అసెస్‌మెంట్‌ మార్కులు 20 వస్తే దానిని ఐదు రెట్లు చేస్తే వంద మార్కులు అవుతాయి. దీంతో అతడికి 10 జీపీఏ కేటాయిస్తారు. ఇప్పుడు ఇలా అనేక పాఠశాలలు తమ విద్యార్థులకు 20 మార్కులు వేసుకున్నాయి. అంటే వారి విద్యార్థులకందరికీ 10 జీపీఏలు వస్తాయి. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం టీచర్లు వాస్తవిక ఆధారంగా మార్కులు వేస్తారు కాబట్టి వారికి 20కి 20 మార్కులు చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే 10 జీపీఏ సాధించే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇలా మార్కుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇలా పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You might also like