FbTelugu

ఇవేం కష్టాలురా బాబూ!

రాజకీయాలు అన్నాక సుఖాలతో పాటు కష్టాలూ తప్పవు. ఆ కష్టాలు పడ్డా ఫలితం తనకు వస్తే.. లాభం తనకే ఉంటే వాటిని తట్టుకోవడానికి ఎంత కష్టమైనా భరిస్తారు రాజకీయ నాయకులు. కానీ, ఇప్పుడు ఎవరో చేసిన పొరపాట్లను, తప్పులను తాము మీద వేసుకొని ఓటర్లను ఒప్పించాల్సిన పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో.. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్ల మాట అటుంచితే సొంత పార్టీ నాయకులే మీటింగుల్లో ఎదురు తిరిగితే.. అభ్యర్థుల ఎదుటే వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. వారిని బుజ్జగించే పరిస్థితి రావడం ఆ నేతలకు దారుణంగానే ఉంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు ఖమ్మం–నల్లగొండ–వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఈ నియోజకవర్గ పట్టభద్రుల స్థానానికి ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేస్తున్నారు. అయితే, ఆయన గత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. అయితే, ఆయన గెలిచిన నాటినుంచి పట్టభద్రులను కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీల అధిపతి నుంచి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆయన ఎదిగారు తప్ప విద్యార్థులు, నిరుద్యోగుల గురించి ఎనాడూ పట్టించుకోలేదని యువత మండిపడుతోంది. ఆయన ఇంజనీరింగ్‌ కాలేజీలను నిత్యం సందర్శిస్తున్నా..

కనీసం ఆ ప్రాంతాల వారికి కూడా అందుబాటులో లేకుండా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేరన్న ప్రచారం సాగుతోంది. ఆయన సేవలన్నీ కేసీఆర్‌కు దగ్గరలోనే ఉండడంతో పల్లా కేసీఆర్‌ను తప్ప మిగతా నాయకులను కూడా పట్టించుకోలేదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో పల్లా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే పార్టీ నేతలు మాట్లాడుతూ గెలిచిన నాటినుంచి ఎన్నడూ కనిపించని పల్లాకు ఓటేయాలని తాము ఏ ముఖం పెట్టుకొని ఓటర్ల దగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. ఇప్పటికే యువత అభ్యర్థితో పాటు తమమీద కూడా మండిపడుతున్నారని.. ఇప్పుడు ఓటుకోసం పోతే చెప్పు తీసుకుకొడతారని నేతలు నిలదీశారు. యువతకు కాదుగదా తాము ఫోన్‌ చేసినా ఎన్నడూ ఎత్తలేదని, తమనే పట్టించుకోలేదని.. అలాంటి వ్యక్తికి యువత ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయం కాబట్టి.. దానికి అనుకూలంగా పనిచేస్తామని.. కానీ, భవిష్యత్‌లో పార్టీ కార్యకర్తలను, యువతను పట్టించుకున్నారన్న హామీ ఎమ్మెల్యేగా మీరు ఇస్తే ప్రచారానికి వెళతామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు నివేదించారు. ఇదంతా జరుగుతున్న సమయంలో వేదికపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి కించిత్తు మాట కూడా మాట్లాడకుండా ఉన్నారట. ఇక, ఇటీవలనే వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ప్రచారానికి వెళ్లిన పల్లాను, టీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకొని వెంటపడి పరుగులు తీయించారు. ఇలాంటి పరిస్థితిలో పల్లా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఆ బాధ్యతను తమ భుజాలపై పెట్టారని నేతలు వాపోతున్నారు. ఓటర్లలో, పార్టీ నేతల్లో ఇంత వ్యతిరేకత ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించడం ఎలాగో తెలియక సతమతమవుతున్నామని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తాము ప్రజల నుంచి చీత్కారాలను దిగమింగుకొని ప్రచారం చేస్తున్నామని.. ఒకవేళ పల్లా ఓడిపోతే తమ రాజకీయ భవిష్యత్‌ పైనా అధిష్టానం వేటు వేసే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు తమ పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్న సామెతలా తయారైందని ఆవేదన చెందుతున్నారు. ఇవేం కష్టాలురా బాబూ అంటూ అధికార పార్టీ నేతలు ఓటర్ల కాళ్లూ వేళ్లూ పట్టుకొని బతిమిలాడే పనిలో పడ్డారట.

You might also like

Leave A Reply

Your email address will not be published.