FbTelugu

పాపం కోదండరాం!

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో. ఈ సామెత సరిగ్గా ఇప్పుడు ప్రొఫెసర్‌ కోదండరాంకు సరిపోతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం జేఏసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో అన్ని పార్టీలను ఏకం చేశారు. వాటన్నింటినీ ఒక తాటిపై నడిపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, సీపీఐతో పాటు మరికొన్ని పార్టీలను ఒక వేదికగా తయారు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అప్పుడు ఆయన ఏది చెపితే అదే అన్నట్టుగా ఉండేది. ఆయన ఇల్లు కూడా నిత్యం ఆయా పార్టీల నేతలతో కళకళలాడేది.

అన్ని పార్టీలకూ ఆయనే నేతృత్వం వహించేవారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత మరింత ఇబ్బందుల పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో జతకట్టి ఘోరంగా విఫలమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ఆయన నేరుగా పోటీచేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా మిత్రపక్షాలు సరిగా సహకరించకపోవడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇప్పుడు నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐలతో పాటు పలు సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

కానీ, ఇప్పటి వరకు ఆయనకు మద్దతు ఇస్తామని ఏ పార్టీ చెప్పలేదు. కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థిని పోటీలో ఉంచాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక, సీపీఎం, సీపీఐలు ఉమ్మడిగా తమ అభ్యర్థిని బరిలో దించుతున్నట్టు ప్రకటించాయి. ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్‌ తానే ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, కోదండరాం ఎన్నికల బరినుంచి తప్పుకొని తనకు మద్దతివ్వాలని రివర్స్‌ ఫిటింగ్‌ పెట్టారు. ఇక, టీడీపీ పరిస్థితి ఏమిటో ఇంతవరకు బయటపడలేదు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే కోదండరామ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నది స్పష్టమవుతోంది. కోదండరాంది ఇక ఒంటరి పోరాటమేనన్న విషయం కూడా తేలిపోయింది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుస్తారా.. లేదా అన్న విషయం అటుంచితే.. ఒకనాడు తను చెప్పిన ప్రకారం నడుచుకున్న పార్టీలు ఇప్పుడు ఒకటి కూడా దగ్గరకు రావడం లేదు. ఆనాడు అందరివాడులా వ్యవహరించిన కోదండరాం ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయన్న సామెతను జనం గుర్తు చేసుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.