FbTelugu

కామ్రేడ్స్‌ ఎటువైపో..?

కమ్యూనిస్టు పార్టీలంటే ఒకప్పుడు అంచనాలు, వ్యూహ, ప్రతి వ్యూహాల్లో ముందుండేవి. కానీ, ఇటీవల కాలంలో ఆ పార్టీలు కార్యాచరణపై అంత తొందరగా అవగాహనకు రాలేకపోతున్నాయి. వారి ఆలోచనలకు అనుగుణంగా ఓ నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాయి. ఒకప్పుడు ఈ పార్టీలకు ఆ అంచనాలు, పోరాటాలే వెన్నుదన్నుగా నిలిచాయి. అందుకే ప్రజలు ఆ పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ, రానురాను ఆ పార్టీలు ప్రజాదరణను కోల్పోతూ వచ్చాయి. ఒకప్పుడు అన్ని పార్టీలనూ గడగడలాడించిన ఆ పార్టీలు ఇప్పుడు ప్రజా పోరాటాలను అటుంచి మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీలు నిలకడ లేని రాజకీయాలు చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూర్జువా పార్టీలతో జతకట్టిన నాటి నుంచి ఆ పార్టీల్లో పదవులపై ఆశలు పెరిగాయి. తనతో ఇప్పటి వరకు తిరిగిన వ్యక్తి ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోయి దర్పాన్ని ప్రదర్శిస్తుండడంతో నాయకులంతా ఆ పదవుల కోసం వెంపర్లాడడం మొదలు పెట్టారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలకు కూడా బూర్జువా పార్టీల అవలక్షణాలన్నీ అబ్బాయన్న భావన ప్రజల్లో ఏర్పడింది.

ఆ బూర్జువా పార్టీలతో జత కట్టినా వాటిలో కూడా నిలకడ లేని నిర్ణయాలు తీసుకోవడం ఆ పార్టీలను ప్రజలకు మరింత దూరమయ్యేలా చేసింది. ఒకసారి కాంగ్రెస్‌ పార్టీపై కోపంతో టీడీపీకి, మరోసారి టీడీపీపై కోపంతో కాంగ్రెస్‌తో.. మరోసారి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా.. ఇంకోసారి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఇలా ఎప్పుడు ఎవరితో కలుస్తారో తెలియని పరిస్థితి ప్రజల్లోనే కాదు.. ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా నెలకొని ఉంది. దీంతో ప్రజలు కూడా వామపక్ష పార్టీల నిలకడపై అనుమానాలు పెంచుకున్నారు. దీంతో రానురాను ఆ పార్టీలకు దూరమవుతూ వచ్చారు. ఇదే పరిస్థితి నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలోనూ నెలకొంది. అక్కడ వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు పోటీ చేయడం లేదు. ఇక్కడ గెలిచేంత బలం ఈ పార్టీలకు లేకున్నా అంతో ఇంతో ఆ పార్టీలకు కొన్ని ఓట్లు ఉన్నాయి. అక్కడ జయాపజయాలను తలకిందులు చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 17న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇంకా పోలింగ్‌కు కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. కానీ, సీపీఎం, సీపీఐలు అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇటీవల వామపక్షాలను టీఆర్‌ఎస్‌ చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆ పార్టీలను టార్గెట్‌ చేసింది. దీంతో కామ్రేడ్లు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌తో కూడా వారికి అంతగా సఖ్యత లేదు. ఇక, ఎలాగూ బీజేపీతో జతకట్టే అవకాశమే లేదు. మొదటి నుంచి బీజేపీతో వామపక్షాలు ఉప్పు నిప్పులాగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్‌లో తమ పార్టీ ఓట్లు వేయాలా అన్న మీమాంసలో ఆ పార్టీల నాయకులు ఉన్నారు. అక్కడ కామ్రేడ్ల నిర్ణయం కోసం కమ్యూనిస్టు కార్యకర్తలతో పాటు మిగతా పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీలు టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తాయా.. కాంగ్రెస్‌కు స్నేహ హస్తాన్నిస్తాయా.. లేక అందరికీ సమదూరం పేరుతో కార్యకర్తల మనోభీష్టానికి వదిలేస్తాయా అన్న నిర్ణయంపై సాగర్‌లో ఉత్కంఠ రేపుతోంది. చూద్దాం కామ్రేడ్ల బాట ఎటువైపు సాగుతుందో..

You might also like

Leave A Reply

Your email address will not be published.