FbTelugu

వారి ఆలోచన ఏంటో!

‘హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఓ మహిళ కరోనా కాలంలో ఇంటినుంచి ఎన్నడూ బయటకు వెళ్లలేదు. ఎంతో జాగ్రత్తలు పాటించింది. ఒకరోజు అత్యవసర పరిస్థితుల్లో కూరగాయల కోసం ఇంటి పక్కనే పెట్టే వారాంతపు సంతకు వెళ్లింది. అక్కడ కూడా ఎవరూ లేని ఓ వ్యకి వద్దకు వెళ్లి టమాటాలు కొని ఐదు నిమిషాల్లోనే ఇంటికి వెళ్లింది.

ఆ కూరగాయల వ్యాపారి చాలా డల్‌గా ఉన్నాడు. బేరం లేక అలా నీరసంగా ఉన్నాడని భావించింది. అంతే రెండు రోజుల తర్వాత ఆ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఆమె కుటుంబంలోని ముగ్గురికి ఆ మహమ్మారి అంటుకుంది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కూరగాయలు అమ్మిన అతడికి అంతకుముందే పాజిటివ్‌ వచ్చిందట. ఆ విషయం అతడికి కూడా తెలుసు. కాకుంటే నాలుగు డబ్బులు వస్తేనే ఇల్లు గడిచేది. కాబట్టి అతడు బయటకు వచ్చి వ్యాపారం సాగిస్తున్నాడు. ఇలా నలుగురికీ పాజిటివ్‌ అంటిస్తున్నాడు. ఇందులో ఎవరి కష్టాలు వారికి ఉన్నా.. కరోనా మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ఇది కేవలం ఆ మహిళ, వ్యాపారి సమస్య కాదు.. ఇప్పుడు ప్రతిచోటా ఇదే సమస్య. పాజిటివ్‌ ఉన్న వారంతా బయటే తిరుగుతున్నారు. వారి దైనందిన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వారిని కట్టడి చేసే పనులేవీ జరగడం లేదు. దీంతో ఎవరికి కరోనా ఉందో తెలియక జనం వారి వద్దకు వెళ్లి దాని భారిన పడుతున్నారు. మొదటి వేవ్‌లో లాక్‌డౌన్‌లో ఉండడం, కట్టడి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇది చాలావరకు నియంత్రించారు. కానీ, ఇప్పుడు దానిపై ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. దీంతో చాలా వేగంగా కరోనా విస్తరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి’.

ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్నది పాతకాలం నాటి సామెత. ఇప్పుడు ఇదే సామెతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దేశంలో రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదవుతున్నాయి. నాలుగువేల మంది దాకా మరణిస్తున్నారు. గతంలో అమెరికాలో ఉన్న పరిస్థితులను కూడా దాటి కరోనా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రభుత్వాలను నమ్ముకుంటే లాభం లేదనుకున్న అనేక రాష్ట్రాలు, పల్లెలు, పట్టణాలు స్వీయ లాక్‌డౌన్‌ను విధించుకుంటున్నాయి. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో గ్రామాలు, పట్నాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా అధికారికంగా లాక్‌డౌన్‌ విధించాయి. కానీ, కేంద్రంగానీ, తెలంగాణ రాష్ట్రంగానీ లాక్‌డౌన్‌కు వ్యతిరేకమని చెబుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 80శాతం గ్రామాలు, పట్టణాలు లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నాయి. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా తెలంగాణలో తీవ్ర పరిస్థితులు లేవని, లాక్‌డౌన్‌ పెట్టాల్సిన పరిస్థితి లేదని చెబుతోంది. దీనిపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయారు. కరోనా విషయంలో టీకాల నిర్వహణ, ఆక్సిజన్‌ పంపిణీ లాంటి విషయాలన్నింటినీ కేంద్రం తనవద్దే ఉంచుకొని తను చెప్పినట్టే చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ, దేశమంతా కరోనాతో అట్టుడికి గంటకు 150 మంది మరణిస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా లాక్‌డౌన్‌ విధించడం తమ పరిధిలో లేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెబుతుండడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. మొత్తానికి దేశాన్ని కాపాడే విషయం తమది కాదంటే తమది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నందున లాక్‌డౌన్‌ విధించడం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయని.. అసలు మనుషులు బతికి ఉంటే కదా ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించేది.. వారే బతికి ఉంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని.. వెంటనే లాక్‌డౌన్‌ పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కేంద్ర, రాష్ట్రాలను వేడుకుంటున్నారు. అసలు కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ఏంటో అర్ధం కావడం లేదని ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.