FbTelugu

ఆయన మీద ప్రేమా.. ఈయన మీద కోపమా!

శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు పెద్దలు. అలాగే రాజకీయాల్లో కూడా ఇదే పద్ధతి ఎక్కువగా పాటిస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్‌ నడుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కరోనాను మించి ట్రోల్‌ అవుతోంది ఈటల రాజేందర్‌ వ్యవహారం. రాష్ట్ర సర్కారు మొత్తం అధికార యంత్రాంగాన్నే ఈటలకు వ్యతిరేకంగా రంగంలోకి దింపింది. అన్ని విభాగాలు ఈటలకు చెక్‌ పెట్టే పనిలో జోరుగా పనిచేస్తున్నాయి. అయితే, అదే ఇప్పుడు ఈటలకు కూడా కలిసివస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈటల టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఆయనకు దూరంగా ఉన్న నాయకులంతా ఇప్పుడు ఈటలకు మద్దతుగా నిలబడుతున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌లోనే ఉండి ఎంపీగా కూడా పనిచేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొంతకాలం క్రితం కేసీఆర్‌ విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేసి ఖాళీగా ఉన్నారు. కేవలం తన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ చేస్తున్నారు. అలాంటి విశ్వేశ్వర్‌రెడ్డి ఇటీవల ఈటలను కేసీఆర్‌ మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఈటల ఇంటికి వెళ్లి కలిశారు. దాదాపు గంటకు పైగా ఈటల ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత కొండా తాను రాజకీయాలు ఏమీ మాట్లాడలేదని, ఈటల భార్య తమకు దూరపు బంధువు కాబట్టి యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చానని చెప్పారు. అయినా, ఈటల రాజేందర్‌కు ప్రజాబలం ఉందని, ఆయనను ఎవరూ ఏమీ చేయలేదని చెప్పారు. ఈటలకు కొండా మద్దతుగా ఉన్నారని ఈ వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. ఇక, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఇన్‌డైరెక్టుగా ఈటలకు మద్దతుగా నిలబడినట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌పై ఒంటి కాలిపై లేచే రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఈటల టార్గెట్‌కు కారణమైన దేవరయాంజాల్‌ భూముల్లో టీఆర్‌ఎస్‌ నేతలే ఎక్కువగా ఆక్రమించారని ఆధారాలతో సహా చూపుతున్నారు. ఈటల మీద చర్యలు తీసుకున్న సీఎం ఈ వివాదంలో ఉన్న ఇతర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ భూముల్లోనూ పర్యటించారు. అయితే, ఈటల మీద వచ్చిన భూ ఆక్రమణ గురించి మాత్రం మాట్లాడడం లేదు. అంటే ఒకరకంగా రేవంత్‌రెడ్డి కూడా ఈటలకు మద్దతుగా ఉన్నారని తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా టీఆర్‌ఎస్‌ నేతలు, రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు కొందరు బయటకు రాకుండా ఈటలకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు వందలాది మంది, వివిధ బీసీ సంఘాల నాయకులు ఈటలకు మద్దతుగా నిలుస్తున్నారు. వీరంతా కేసీఆర్‌ను బహిరంగంగా విమర్శిస్తూ ఆందోళనలకు కూడా దిగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈటల ఎపిసోడ్‌లో రోజురోజుకూ ఈటల రాజేందర్‌కు మద్దతు పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ మద్దతు రాజేందర్‌రెడ్డిపై ప్రేమతో వస్తుందా.. లేక కేసీఆర్‌ వ్యతిరేకులంతా ఈటల పంచన చేరుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైమైనా కేసీఆర్‌ వ్యతిరేకులంతా ఒక్కదగ్గరకు చేరుతున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మొత్తానికి భవిష్యత్‌లో ఈ ఎపిసోడ్‌కు ఎక్కడ ముగింపు పడుతుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.