FbTelugu

ఏ ‘గట్టు’కు చేరతారో?

గట్టు శ్రీకాంత్‌రెడ్డి. వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. అది కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో ఉండి. జగన్‌ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. మొదటి నుంచీ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అభిమానిగా ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి అదే అభిమానంతో జగన్‌కు కూడా అండగా ఉన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధి కోసం నిద్రాహారాలు మాని పనిచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైసీపీ అంతోఇంతో బలం కలిగి ఉన్నదంటే అది హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే. అక్కడ జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గట్టు పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మిగతా పక్షాలకు కూడా చెమటలు పట్టించాడు. ఒక దశలో అక్కడి నుంచి వైసీపీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయన్న చర్చ కూడా సాగింది. అంతగా పార్టీని బలోపేతం చేశారు గట్టు శ్రీకాంత్‌రెడ్డి. అందుకే వైఎస్‌ జగన్‌కు శ్రీకాంత్‌రెడ్డి అంటే ప్రేమ ఎక్కువ.

ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డిని వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు జగన్‌. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో పనిచేశారు. రాష్ట్రంలో జగన్, షర్మిల పాదయాత్రలను విజయవంతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అలాంటి గట్టు శ్రీకాంత్‌రెడ్డి కొన్ని రోజులుగా రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు. కేవలం వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. జగన్‌ తెలంగాణను వదిలి కేవలం ఏపీపైనే శ్రద్ధ పెట్టడంతో ఇరకాటంలో పడిన గట్టు రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారన్న చర్చ సాగింది. అయితే, షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న సందర్భంలో మళ్లీ గట్టుపై చర్చ జరిగింది. ఆయన వైసీపీలోనే ఉంటారా.. లేకుంటే షర్మిల పార్టీలో చేరి మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తారా అన్న చర్చ సాగింది. అయితే, ఇటీవల తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన సందర్భంలో జగన్‌ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన చేశారు. షర్మిల పార్టీకి.. వైసీపీకి.. జగన్‌కు సంబంధమేమీ లేదని తేల్చి చెప్పారు. పైగా తమ పార్టీని తెలంగాణలో విస్తరించే కార్యక్రమాలేవీ చేపట్టడం లేదని, కేవలం ఏపీపైనే తమ దృష్టంతా ఉందని చెప్పారు. దీంతో వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్‌రెడ్డికి ఇక్కడ పనిలేకుండా పోయింది. దీంతో తన రాజకీయ భవిష్యత్‌ పరిస్థితి రసకందాయంలో పడింది. దీంతో ఏం చేయాలా అన్న మీమాంసలో ఉన్న ఆయన ఇక వైసీపీని నమ్ముకుంటే పని జరగదన్న నిర్ణయానికి వచ్చి వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఒక జాతీయ పార్టీలో చేరతానని, ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని కూడా ప్రకటించారు. అది ఆయన చెప్పిన జాతీయ పార్టీ ఏదన్న దానిపై జోరుగా ట్రోలింగ్‌ నడుస్తోంది. గతంలో పనిచేసిన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారా..? లేక బీజేపీలోనా అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, ఆయన ఏ పార్టీలో చేరినా వచ్చే ఎన్నికల్లో ఆయన చెప్పినట్టు ఆ పార్టీలు శ్రీకాంత్‌రెడ్డికి టికెట్‌ ఇస్తాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ గట్టు ఏ గట్టుకు చేరతారో.. ఆయనకు అక్కడ ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.