FbTelugu

ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారో!

ప్రజల మన్ననలు పొందేందుకు రాజకీయ పార్టీలు అనేక రకాల పథకాలను అమలు చేస్తుంటాయి. తాము పదవుల్లోకి రావడానికి.. వచ్చిన పదవులను కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అవన్నీ ప్రజల సౌకర్యం కోసమే ప్రవేశపెడుతున్నామని చెబుతుంటాయి. వాటిద్వారా ప్రజలక కూడా ఎంతోకొంత మేలు జరుగుతతూనే ఉంటుంది. ఇలాంటి పద్ధతి ఇప్పటి కొత్తగా వచ్చిందేం కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తూనే ఉన్నాయి. కానీ, ఇటీవల కొన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు కొన్ని ప్రజలను తికమకలకు గురిచేస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు అమలు చేస్తున్న పథకాలు ఎంతవరకు ప్రయోజనమో.. అవి ఏ పరిస్థితులకు దారితీస్తాయోనన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా లాజిక్‌ లేకుండా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయని కొందరు రాజకీయ పండితులు చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి పథకమే తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని, దానిపై ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయని వారు అభివర్ణిస్తున్నారు.

తెలంగాణలో వృద్ధాప్య పింఛన్‌ వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎందుకంటే నానాటికి జీవన ప్రమాణ కాలం తగ్గిపోతుండడంతో ఈ వయస్సు వారు పనులు చేసుకొని సంపాదించుకునే స్థితిలో ఉండలేరన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవమే. ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు, ఆహార అలవాట్లలో మార్పులతో తక్కువ వయస్సు ఉన్న వారు కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వడం మంచిదే. కానీ, అదే కేసీఆర్‌ దీనికి విరుద్ధంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలకు పొంతన లేకుండా పోయిందని ఇప్పుడు తెలంగాణలో యువత, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 57 ఏళ్లకే వృద్ధులవుతారని, వారు ఏ పనీ చేసుకోలేరని చెబుతున్నా కేసీఆర్‌.. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు ఎలా పెంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. 61 ఏళ్ల వయస్సులో వారి పనులు వారే చేసుకునే పరిస్థితిలో లేని వారు ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచితే కార్యాలయాల్లో పనులన్నీ నత్తనడకన సాగుతాయని, పైగా యువతకు ఉద్యోగాలు రాక అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి డక్కీ ముక్కీలు తిన్న కేసీఆర్‌ ఈ చిన్న లాజిక్‌ ఎలా మిస్సయ్యారా అని యువత ప్రశ్నిస్తోంది. నిజమే.. వ్యూహ ప్రతివ్యూహాల్లో మొదటి స్థానంలో ఉన్న కేసీఆర్‌ ఈ లాజిక్‌ను ఎలా మిస్సయ్యారో మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.