FbTelugu

వారికి ప్రొఫెసర్ల భయం పట్టుకుందా..?

తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఇద్దరు ప్రసిద్ధులైన ఇద్దరు ప్రొఫెసర్లు బరిలోకి దిగారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానం నుంచి తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జేఏసీ కన్వీనర్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ కోదండరాం బరిలోకి దిగితే, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్‌ పోటీలో నిలిచారు. వాస్తవానికి వీరిద్దరూ పట్టభద్రులకు చిర పరిచితులే. వాస్తవానికి వివిధ పార్టీల నుంచి రంగంలో ఉన్న అభ్యర్థుల కంటే వీరే ఎక్కువగా తెలుసు. కోదండరాం తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా తిరిగి ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఉద్యోగులు, నిరుద్యోగులను ఒక్కతాటిపై నడిపించారు. ఇక, నాగేశ్వర్‌ ప్రతిరోజూ టీవీ చానళ్లలో దర్శనమిస్తూ ప్రభుత్వ విధానాలు.. వాటి వెనుకున్న పరిణామాలు.. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది.. వాటికెనుక ఉన్న వాస్తవాలు.. వాటిద్వారా ప్రజలకు, వివిధ వర్గాలకు జరిగే నష్టాలపై సామాన్యుడికి సైతం అర్ధమయ్యే రీతిలో చెబుతూ టీవీల్లో నిత్యం ప్రత్యక్షమవుతూ ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి. దేశంలో ఏదైనా పరిణామం జరుగుతుందంటే దాని గురించి తెలుసుకోవాలంటే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఉపన్యాసాల కోసం ఎదురు చూస్తారు. పైగా ఆయన మహా మేధావిగా సుపరిచితులు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇచ్చే శిక్షణలోనూ ఆయన ఉపన్యాసాలు ఉంటాయంటే ఆయన ఏ స్థాయి మేధావో అందరికీ తెలిసిందే. అందుకే ప్రధాన పార్టీలకు వీరద్దరి భయం పట్టుకుందన్న ప్రచారం సాగుతోంది. పైగా వివాదరహితులు. అందుకే ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీలు వీరికి భయపడుతున్నాయన్న చర్చ సాగింది.

వాస్తవానికి పార్టీ అభిమానం ప్రకారం తమకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసినా రెండో ప్రాధాన్యతా ఓటు నల్లగొండ స్థానంలో కోదండరాంకు, హైదరాబాద్‌ స్థానంలో నాగేశ్వర్‌కు పడతాయన్న నిజాన్ని వారు తెలుసుకొని దానికి చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేశారట. అందుకే తమ పార్టీకి సాలీడ్‌గా ఉన్న ఓటర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ ఎన్నికల్లో అభ్యర్థులందరికీ ప్రాధాన్యతా క్రమంలో అందరికీ ఓటేసే అవకాశమున్నా తమ పార్టీ అభ్యర్థికి మొదటి ఓటు వేసి రండని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో ప్రాధాన్యతా ఓటును ఇతరులకు ఎవరికీ వేయవద్దని.. అలా వేస్తే తమ పార్టీ అభ్యర్థికి కష్టమవుతుందని చెప్పారట. ఒకవేళ రెండో ప్రాధాన్యతా ఓటు వేస్తే అది కచ్చితంగా తమ పార్టీ ఓటర్లు కూడా ఆ ఇద్దరు ప్రొఫెసర్లకే వేస్తారనే అంచనాతో అధికార టీఆర్‌ఎస్, విపక్ష బీజేపీలు ఇలా ప్రచారం చేశాయని ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. అయినా, నేతల మాటలు కాదని చాలామంది రెండో ప్రాధాన్యతా ఓటును కూడా వేశారట. దీనిపై టీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన కొందరు ఓటర్లు మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యతా ఓటును తమ పార్టీ అభ్యర్థికి వేసుకున్నామని, రెండో ప్రాధాన్యతా ఓటును ప్రొఫెసర్‌కు వేశామని చెబుతున్నారు. ఒకవేళ తమ అభ్యర్థి గెలిస్తే పర్వాలేదు. ఒకవేళ తమ అభ్యర్థి ఓడిపోయినా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు అండగా ఉండే ప్రొఫెసర్లు గెలవడం న్యాయమే కదా.. అందుకే తమ నేతలు వద్దన్నా రెండో ప్రాధాన్యతా ఓటును వేశామని చెబుతున్నారు. మొత్తానికి రెండు నియోజకవర్గాల్లోనూ బరిలో నిలిచిన ప్రొఫెసర్‌ అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతలకు చెమటలు పట్టించారన్న మాట. కానీ, ఆ నేతల చర్యలతో ప్రొఫెసర్ల విజయాన్ని అడ్డుకోగలరో.. లేదో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.