FbTelugu

ఆయనను ఒంటరిని చేశారా!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన బాధ్యతలను స్వేచ్ఛగా నిర్వర్తిస్తున్నారా..? పార్టీ నాయకత్వమంతా ఆయన వెంటే నడుస్తుందా..? సీనియర్లు ఆయనకు మద్దతుగా కదలివస్తున్నారా..? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పనిలో సోము దూసుకుపోతున్నారా.. అంటే కాదనే సమాధానమే వస్తోంది. బీజేపీలోని కొందరు సీనియర్లు ఆయనకు అసలు సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సోము వీర్రాజు ఒంటరి వాడయ్యాడన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సీనియర్ల సహాయ నిరాకరణతో సోము ఒంటరిపోరు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.

గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణతో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు ప్రభుత్వంపై గట్టిగా పోరు నడిపేందుకు తగినన్ని అవకాశాలు లభించాయి. రాజధాని వ్యవహారం ఓవైపు, హైకోర్టు, ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరు మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలు ఇంకోవైపు ఇలా ప్రతీ అంశంలోనూ బీజేపీకి సమర్ధంగా ప్రభుత్వాన్ని ఆడుకునే అవకాశం దొరికింది. వీటన్నంటికీ పరాకాష్టగా తాజాగా దేవతా విగ్రహాల ధ్వంసం వ్యవహారం దొరికింది. మరి బీజేపీ వాటిని అందిపుచ్చుకుందా అంటే లేదన్న సమాధానమే వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ ఛీఫ్‌ సోము వీర్రాజు ఒంటరిపోరు. పార్టీలో గతంలో పదవులు వెలగబెట్టిన వారితో పాటు తాజాగా కమిటీల్లో స్ధానం దక్కించుకున్న కమ్మ సామాజిక వర్గ నేతలెవరూ సోముతో కలిసి వచ్చేందుకు ఇష్టపడటం లేదట. దీంతో సీనియర్‌ నేతలెవరూ లేకుండానే సోము వీర్రాజు ఒంటరి పోరాటం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో రెండు, మూడు వర్గాలున్నాయి. వీరిలో గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన వారు, టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీలు, తాజాగా కమిటీల్లో చోటు దక్కించుకున్న కొత్త ముఖాలు.. ఇలా పలు వర్గాలున్నాయి. వీరిని ఏకతాటిపైకి తీసుకురావడంలో సోము వీర్రాజు విఫలమవుతున్నారు. దీనికి మరో కారణం ఏపీలో ఉండే సంక్షిష్టమైన కుల సమీకరణాలు.

వరుసగా రెండోసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష బాధ్యతలు దక్కడంతో మిగతా బలమైన సామాజిక వర్గాలు దీన్ని అంగీకరించే పరిస్ధితుల్లో లేనట్లే కనిపిస్తోంది. లేకపోతే అమరావతి కోసం ఉద్యమాలు చేసినప్పుడు కలిసొస్తున్న నేతలు ఆలయాల విధ్వంసంపై సాగుతున్న పోరు మైలేజ్‌ తెస్తుందని తెలిసీ మొహం చాటేయడం దేనికి నిదర్శమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీకి ఇలాంటి అవాంతరాలు చికాకు కలిగిస్తున్నాయి. మరి, సోము వీర్రాజు వీటన్నింటినీ తట్టుకొని అందరినీ ఏకం చేస్తారో లేదోనన్న అనుమానాలు కూడా పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తున్నాయి. మొత్తానికి వీర్రాజును ఒంటరి చేయడంలో ఏదో బలమైన కారణమే ఉంటుందని.. అదేంటో తేలాలంటే కొంత సమయం పడుతుందని బీజేపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఏపీ బీజేపీ పరిస్థితి ఏమవుతుందో.. ఇది ఏ మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే మనమూ కొంతకాలం వేచి చూడక తప్పదు మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.