FbTelugu

తెలంగాణ నెత్తిన అప్పుల కుంపటి

తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావడం అటుంచితే.. అప్పులమయంగా మారుతోంది. ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిన కుంపటిలా మారుతున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులుగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. తెలంగాణ ప్రభుత్వం అంచనాలకు మించి అప్పులు చేస్తూ  ప్రజలపై పెనుభారం మోపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ అప్పుల చిట్టా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పద్దు రోజురోజుకు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ నిర్వహణ చట్టం పరిమితులకు లోబడి ప్రభుత్వం ఏటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి అంటే ఎంతగా అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది 2.30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ కాగా మొత్తం అప్పులు 2.86 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 41వేల కోట్ల రూపాయలు అప్పులు పెరగనున్నట్లుగా తాజా ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2.44 లక్షల కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్లో సేకరించింది.

ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 7,852 కోట్ల రూపాయలు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్ల రూపాయలు, బాండ్ల రూపంలో 19,552 కోట్ల రూపాయల రుణాలను సమీకరణ చేసినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో ఉన్న జనాభాకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తిపై 81,395 రూపాయలు అప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గతేడాది తలసరి అప్పు 65,480 రూపాయలు. ప్రస్తుతం మరో 16 వేలకు పైగా పెరిగి 8,1395 రూపాయలకు తలసరి అప్పు చేరుకుంది. ఇదంతా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రజల కోసమే అప్పులు చేస్తున్నట్టుగా ప్రభుత్వం సైతం చెప్పుకోవడం కనిపిస్తోంది. ఈ ఏడాది అప్పు పెరగడానికి కరోనా మరో కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గత ఆరేళ్ల లెక్కలను బట్టి 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2021–22 ముగిసే సరికి అప్పు 2.86 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. రాష్ట్రంపై అక్షరాల ఆరేళ్లలో లక్షా 57 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.