FbTelugu

ఏమండోయ్‌.. ఇది విన్నారా!

ఏమండోయ్‌.. ఇది విన్నారా! ఈ డైలాగ్‌ ఓ పాత సినిమాలోనిది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ తెలంగాణలో బాగా ట్రోల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ ఈ డైలాగ్‌కు.. స్టోరీకి ఏం సంబంధం అని అనుకుంటున్నారు కదా.. అదే విషయానికి వస్తున్నా.. తెలంగాణలో కరోనా నానాటికీ పెరిగిపోతోంది. కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా అదే దారిలో నడుస్తోంది. కరోనా కట్టడికోసం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించినా ఫలితం ఉండడం లేదు. సాక్షాత్తు సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లు కరోనా బాధితులుగా మారారు. తర్వాత వారిద్దరూ కోలుకున్నారనుకోండి అది వేరే విషయం. తెలంగాణలో కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. కేవలం రెండు వారాల్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తే వారికి నరకం కనిపిస్తోంది. పైగా ప్రతి ఇంటిలో కరోనా బాధితులున్నారు. నగరంలోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో బెడ్లు అక్కడక్కడా ఖాళీగా ఉన్నా వారు భారీగానే దండుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తెలంగాణలో టెస్టుల సంఖ్య బాగా తగ్గించారు.

కొన్ని రోజుల పాటు టెస్టులే చేయడం లేదు. ఏ ఆసుపత్రికి వెళ్లినా టెస్టింగ్‌ కిట్లు లేవన్న సమాధానమే వస్తోంది. టీకాలు, టెస్టింగ్‌ కేంద్రాలు, ఆసుపత్రుల్లో బెడ్ల వద్దే కాదు చివరకు చనిపోతే శ్మశానాల్లో మృతదేహాల దహనానికి కూడా సీరియల్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రంతా శవాలను దహనం చేయడం వల్ల ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హైదరాబాద్‌లోని శ్మశానవాటికల సమీపంలో ఉన్న జనం ఆందోళనకు దిగిన సంఘటనలు కూడా చూశాం. టెస్టుల సంఖ్య తగ్గడంతో పాజిటివ్‌ల సంఖ్య కూడా తగ్గింది. మరో పక్క హైకోర్టు కూడా కొవిడ్‌ నియంత్రణ చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తీవ్రంగా విమర్శిస్తోంది. టెస్టులు చేయకుండా కరోనా పాజిటవ్‌ కేసులు తగ్గాయని ఎలా చెబుతారని కూడా ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానాధికారి మాత్రం తెలంగాణలో కరోనా చాలా తక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే కేసులు తక్కువగా వస్తున్నాయి. కాబట్టి లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. బయట పరిస్థితులను చూస్తున్న జనం మాత్రం ఈ వ్యాఖ్యలను చూసి నవ్వుకుంటున్నారు. కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం కరోనా లేదని చెప్పడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కరోనా వచ్చిన వ్యక్తులు యథేచ్చగా బయట తిరుగుతున్నారని, వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారని.. వారిని నియంత్రించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయన్న విషయం ఆ అధికారికి తెలియదా అని చర్చించుకుంటున్నారు. అలాంటి సూపర్‌ స్పైడర్లను కంట్రోల్‌ చేయకుండా కరోనా లేదని చెబుతుండడాన్ని చూసి నవ్వుకుంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.