FbTelugu

అమ్మగానా.. అధ్యక్షురాలిగానా..?

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల తెలంగాణలో పార్టీకి ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఆమె పార్టీ వెనుక జగన్‌ ఉన్నారా.. ఆయనకు చెప్పే పార్టీ పెడుతున్నారా.. లేక జగన్‌పై కొంత కాలంగా షర్మిల కోపంగా ఉన్నారని.. రాజకీయంగా తనను కావాలని జగన్‌ దూరం పెడుతున్నారని అందుకే ఆయనకు వ్యతిరేకంగానే పార్టీ పెడుతున్నారని ఇలా రకరకాలుగా చర్చోపచర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలకు ముగింపు పలుకుతూ వైఎస్‌ కుటుంబానికి దగ్గరి బంధువు, ఏపీ సీఎం రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. షర్మిల పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని.. పార్టీ వద్దని జగన్‌ చెప్పినా షర్మిల వినలేదని.. ఆమె పెట్టే పార్టీకి జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ, షర్మిల ఇక్కడ పార్టీకి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను జోరుగా పెంచారు. అన్ని జిల్లాల్లోని వైఎస్‌ అభిమానులతో చర్చలు జరిపారు.

అనంతరం ఖమ్మంలో సభను నిర్వహించారు. ఇక్కడే పెద్ద ట్విస్టు జరిగింది. ఈ సభకు షర్మిల తల్లి విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. ఆమె చెప్పినట్టుగానే విజయమ్మ సభకు హాజరై తన కూతురు షర్మిలకు అండగా నిలవాలని వైఎస్‌ అభిమానులను, తెలంగాణవాసులను కోరారు. ఆ సభ విజయవంతం కావడంతో షర్మిల దూకుడు పెంచారు. అనంతరం నిరుద్యోగుల తరఫున హైదరాబాద్‌లో దీక్షకు దిగారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ఆమె ఈ దీక్షకు దిగారు. ఈ దీక్ష ప్రారంభం నుంచి ముగించే వరకు షర్మిల పక్కనే విజయమ్మ ఉన్నారు. కూతురు పార్టీ పెడితే తల్లి మద్దతు తెలపకుండా ఎలా ఉంటుంది అన్నదే కదా మీ అనుమానం. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. విజయమ్మ కేవలం షర్మిలకు సతల్లే కాదు.. కొడుకు జగన్‌ పెట్టిన పార్టీ వైసీపీకి గౌరవాధ్యక్షురాలు కూడా. షర్మిల పార్టీపై జగన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా వైసీపీకి, షర్మిల పార్టీకి సంబంధం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వాస్తవానికి జగన్‌ నిర్ణయం ప్రకారం వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిల పార్టీకి మద్దతుగా రాకూడదు. అలా వచ్చారంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే.. ఇప్పుడు ఆమె మీద వైసీపీ నేతలు ఏమైనా చర్యలు తీసుకుంటారా.. లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
పైగా విజయమ్మ ఖమ్మం సభలో మాట్లాడుతూ తాను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరఫున ఈ సభకు హాజరయ్యానని చెప్పారు. ఇంతకీ విజయమ్మ షర్మిలకు మద్దతుగా ఏ హోదాలో హాజరయ్యారోనని రాజకీయ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. షర్మిల తల్లిగా హాజరయ్యారా..? వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా వచ్చారా..? తన భర్త వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరఫున హాజరయ్యారో తెలియడం లేదన్న చర్చ జోరుగా రాజకీయవర్గాల్లో సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.