FbTelugu

ఆ రెండు ఏమయ్యాయో!

ఏపీలో ఒకప్పుడు రాజకీయాలు తల్లకిందులయ్యేలా రెండు నేరాలు జరిగాయి. అప్పట్లో ఇవి హాట్‌ టాపిక్‌గా మారాయి. రాజకీయాలన్నీ వీటి చుట్టూనే తిరిగాయి. ఈ దారుణాలకు బాధ్యులు మీరంటే మీరని విమర్శలు.. ప్రతి విమర్శలు.. చాలెంజ్‌ల దాకా వెళ్లింది. ఇదంతా జరుగుతున్నపుడు అక్కడ టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇంతకీ ఆ రెండు ఘటనలేమిటా అని ఆలోచిస్తున్నారా.. అదేనండి, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య, జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తితో దాడి. ఈ రెండింటి వెనక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.

దీనిపై సుప్రీంకోర్టు జడ్జిచేత విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహించారు. దీనికి టీడీపీ కూడా దీటుగానే స్పందించింది. వివేకానందరెడ్డి హత్యలో వైస్‌ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని, వారే హత్య చేసి ఉంటారని తెలుగుదేశం నాయకులు కూడా కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌పై జరిగిన దాడిని కూడా వారే జరిపించుకున్నారని విమర్శలకు దిగారు. ఒక దశలో ఈ కేసులను విచారిస్తున్న ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని కూడా జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ దీనిపై పోరాటాలు జరిగేవి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం పరాజయం పాలై వైసీపీ అధికారంలో వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు దాటింది. కానీ, అప్పుడు నానా యాగీ చేసిన వైసీపీ నేతలు ఆ రెండు కేసుల గురించి ఇప్పుడు పట్టించుకోవడం మానేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ దారుణాల వెనకాల టీడీపీ ఉంటే అధికారం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది కదా.. వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా.. కానీ, అలాంటి చర్యలు తీసుకోవడంలో వైసీపీ సర్కారు తాత్సారం చేస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఒక సీఎం బాబాయి విషయంలోనే న్యాయం జరగక పోతే సాధారణ పౌరుల పరిస్తితి ఏంటన్న వాదన కూడా వినిపిస్తోంది. తన తండ్రి హత్యపై అనేక అనుమానాలున్నాయని, వెంటనే వెంటనే విచారణ చేపట్టి బా«ధ్యులపై చర్యలు తీసుకోవాలని వివేకానందరెడ్డి కూతురు రెండేళ్ల నుంచి కోరుతున్నా ప్రభుత్వం, జగన్‌ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో ఆమె ఢిల్లీలోని పలువురు న్యాయనిపుణులను కూడా కలిసి మద్దతు కోరింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె హాట్‌హాట్‌ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బాగా పలుకుబడి కలిగిన ఓ వ్యక్తి ఈ కేసు గురించి వదిలివేయాలని.. నీవు ఎంత తిరిగినా ఫలితం ఉండదని చెప్పారని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. తనను బెదిరింపులకు కూడా గురిచేసినట్టు ఆరోపించింది. సొంత బాబాయి హత్య, స్వయంగా తనపైనే హత్యాయత్నం జరిగిన కేసులపై వైసీపీ సర్కారు, జగన్‌ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్ధం కావడం లేదని వైసీపీ కార్యకర్తలు కూడా గుసగుసలాడుతున్నారు. ఈ రెండు కేసుల గురించి జగన్‌ పట్టించుకోవడం లేదంటే అప్పట్లో టీడీపీ వైసీపీపై చేసిన ఆరోపణలు నిజమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని ఏపీలో అంతా చర్చించుకుంటున్నారు. అసలు దీని వెనక రహస్యమేందో పెరుమాళ్లకెరుక అనుకుంటూ చర్చలు జరుపుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.