FbTelugu

ఆ రోజు రిపీటవుతుందా..?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. సరిగ్గా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. పైగా రాజకీయాల్లో ఇప్పుడు శత్రువులుగా ఉన్న వారు రేపు మిత్రులుగా మారవచ్చు. నేడు మిత్రులుగా ఉన్న వారు రేపు శత్రువులుగా మారవచ్చు. అలా మారిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో ఎప్పుడో కొంతమంది విషయంలో జరిగిన పరిణామాలు కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే పద్ధతిలో జరిగే పరిస్థితి కూడా రాజకీయాల్లో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిణామాలే జరుగుతున్నాయా అంటే కాదని కొట్టివేసే పరిస్థితులు మాత్రం లేకుండా పోయాయి. గతంలో ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విషయంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు సరిగ్గా ఆయనకే ఎదురవుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న రోజుల్లో ఇప్పటి సీఎం కేసీఆర్‌ ఆయన మంత్రివర్గంలో కొనసాగారు. అయితే, వారిద్దరి మధ్య వచ్చిన తేడాలతో చంద్రబాబు కేసీఆర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇది జరిగి సరిగ్గా 21 సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో కేసీఆర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన టీడీపీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి సీఎంగా గద్దెనెక్కారు. రెండోసారి కూడా ఆయన సీఎం అయ్యారు. గతంలో తాను పనిచేసిన టీడీపీనే కేసీఆర్‌ టార్గెట్‌ చేశారు. ఆ పార్టీ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. చివరకు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలనందరినీ తన పార్టీలో చేర్చుకొని టీడీఎల్పీనే టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసి దెబ్బకొట్టారు. అసలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే లేదన్నట్టుగా దానిపై పగ తీర్చుకున్నారు. అయితే, ఇవే పరిణామాలు ఇప్పుడు ఈటల రాజేందర్‌ రూపంలో మళ్లీ జరగబోతున్నాయా అన్న చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. అప్పట్లో కేసీఆర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి చంద్రబాబు తప్పు చేస్తే ఇప్పుడు కేసీఆర్‌ ఈటలను తప్పించి తప్పు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఇప్పటికే ఆయనకు రాష్ట్రంలో సానుభూతి పవనాలు వీస్తున్నాయి. అనేకమంది బీసీ నేతలతో పాటు విపక్షాల నుంచి కూడా ఈటలకు మద్దతు లభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.

ఈటల కూడా ఇతర పార్టీల్లోని కొందరు నాయకులతో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనిని ఈటల కొట్టి పారేస్తున్నా వాస్తవం అదే అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాకుంటే ఆయన ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి అదేస్థానం నుంచి విజయం సాధించి తన సత్తాను చాటుకోవాలన్న ఆలోచనలో ఈటల ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా తన సత్తా చాటిన తర్వాత కొత్త పార్టీ ఆలోచనను ముందుకు తీసుకెళ్తారని జోరుగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఈటల పార్టీ పెడితే బీసీలతో పాటు టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు కూడా ఆ పార్టీలో చేరేలా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట. ఒకవేళ ఈటల పార్టీ పెట్టి సక్సెస్‌ అయితే.. సరిగ్గా చంద్రబాబు చేసిన తప్పే కేసీఆర్‌ చేసినట్టు అవుతుందని.. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిణామాలే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదన రాజకీయ పండితుల నుంచి కూడా వినిపిస్తోంది. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎలా ముందుకు పోతుందో చూడాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.