FbTelugu

వారిద్దరికీ చెడినట్టేనా..?

ప్రాంతాలుగా విడిపోదాం.. సోదరుల్లా కలిసుందాం. ఇది తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలు విడిపోవడానికి ముందు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పిన మాట. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. వీరిద్దరి మధ్య పరిస్థితి ఉప్పు.. నిప్పులా మారింది. ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. చాలెంజ్‌లు విసురుకున్నారు. కేసులు పెట్టుకునే దాకా వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కూడా కష్టతరంగానే మారింది. అయితే, ఏడాదిన్నర క్రితం రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. వీరిద్దరి మధ్య అధికారంలోకి రాకముందే సయోధ్య ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకరినొకరు తిట్టుకున్నా ఆ తర్వాత వారిద్దరూ గురుశిష్యులుగా మెలిగారన్న ప్రచారం కూడా సాగింది. ఇద్దరు మిత్రులు అధికారంలోకి వచ్చారు కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని అందరూ భావించారు. జగన్, కేసీఆర్‌ అనేకసార్లు భేటీ అయ్యారు. కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నారు.

ఒకరి అసెంబ్లీలో ఒకరిపై పొగడ్తలకు దిగారు. కానీ, ఇటీవల పరిణామాలు చూస్తుంటే వారి మధ్య చెడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో వీరిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయంటున్నారు. ఇదే విషయంలో కేసీఆర్‌ జగన్‌ సర్కారును ఘాటుగా విమర్శించారు. పిలిచి అన్నం పెట్టిన వారికే ద్రోహం చేయడానికి చూస్తున్నారని విమర్శలకు దిగారు. దానికి ఏపీ సర్కారు కూడా ఏదో వివరణ ఇచ్చుకుందనుకోండి. ఇద్దరు మిత్రులుగా ఇప్పటి వరకు రాసుకుపూసుకు తిరిగిన జగన్, కేసీఆర్‌ మధ్య స్నేహం చెడిందా.. లేక ఇందులో ఏమైనా రాజకీయ కోణముందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఇదే విషయంపై చర్చలు జరిపి పరిస్థితిని చక్కిదిద్దేందుకు కేంద్రం ఈ నెల 5న అపెక్స్‌ కమిటీని ఏర్పాటు చేసి ఇద్దరు సీఎంలనూ పిలిచింది. కానీ, ఇద్దరు సీఎంలు కూడబలుక్కున్నట్టుగా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. మొత్తానికి ఇద్దరు సీఎంల మధ్య జలజగడం మొదలైందని.. అది భవిష్యత్‌లో ఎటువైపు వెళ్తుందోనని సర్వత్రా చర్చ సాగుతోంది.

You might also like