FbTelugu

చంద్ర‌బాబులో నిర్వేదం!

ఎంతైనా చంద్ర‌బాబు గ్రేట్ లీడ‌ర్‌. విజ‌న్ ఉన్న పాల‌కుడు. ఇది ఎవ్వ‌రూ కాద‌నలేని నిజం. బాబు పేరు వింటేనే అరికాలిమంట నెత్తికి ఎక్కే జాబితాలో ఉండే కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ కూడా బాబు విష‌యంలో ఆచితూచి మాట్లాడ‌తారు. హైద‌రాబాద్‌లో ఐటీకు బాట‌లు వేసింది ఎవ‌రైనా పునాది మాత్రం బాబు హ‌యాంలోనే ప‌డింది. ఏం చేయాల‌నే అంశంపై స్ప‌ష్ట‌త ఉంటుంది. ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధంగా ఉంటుంది. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌బెడితే మూడు ద‌ఫాలు సీఎంగా చేసిన బాబుకు 2014 ఎన్నిక‌లు స‌వాల్‌గా మారాయి. అప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌వా న‌డుస్తుంది. బీజేపీ గాలి వీస్తుంది. కానీ.. ఈ రెండూ టీడీపీ త‌ట్టుకోవ‌టం క‌ష్ట‌మ‌నేది దాదాపు అంద‌రికీ అర్ధ‌మైంది. ఆ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడితే ఇక మూటాముల్లె స‌ర్దుకుపోవ‌ట‌మే అనేంత‌గా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.

కానీ.. అక్క‌డ త‌న రాజ‌కీయం ఉప‌యోగించి కాషాయానికి జై కొట్టాడు. అంత‌కుముందు తిట్టిపోసిన మోదీ తో పొత్తు కు సై అన్నాడు. జాతీయ‌స్థాయిలో అది బాగానే ప‌నిచేస్తుంది. మ‌రి ఏపీలో జ‌గ‌న్ ఓటుబ్యాంకును చీల్చేదెలా! ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ప‌వ‌న్‌తో స్నేహం చేశాడు. చివ‌రి క్ష‌ణంలో వైసీపీను ఊహించ‌ని దెబ్బ‌తీశాడు. గెలుపు కొమ్మ‌న కూర్చున్న పార్టీను ఐదేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండేలా మార్చాడు. అంత‌టి వ్యూహం ఉన్న చంద్ర‌బాబు అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఎందుకో తాత్సారం చేశారు. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో శాశ్వ‌త భ‌వ‌నాలు నిర్మించే అవ‌కాశాన్ని మ‌రో ఐదేళ్ల‌కు వాయిదావేశారు. పూర్తయితే జ‌నం త‌న‌ను మ‌ర‌చిపోతార‌నే ఆలోచ‌నే దీనికి కార‌ణ‌మంటూ సొంత పార్టీ నేత‌లు కూడా చెబుతుంటారు. పోల‌వ‌రం విష‌యంలోనూ సొంత‌నేత‌ల‌ను న‌మ్మి వాస్త‌వాల‌ను గుర్తించ‌టంలో ఆల‌స్యం చేశారు. అవినీతి ముద్ర పెద్ద‌గా ప‌డ‌ని టీడీపీ పూర్తిగా అక్ర‌మాల బుర‌ద‌లో కూరుకుపోయింద‌నే విష‌యం ఆయ‌న వ‌ర‌కూ చేర‌టంలో ఆల‌స్య‌మైంది. అప్ప‌టికే చిన‌బాబు ప‌క్క‌న చేరిన భ‌జ‌న‌బ్యాచ్‌తో జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. చంద్ర‌బాబు మంచోడు.. విజ‌న్ ఉన్న నాయ‌కుడు అని జ‌నం సానుభూతి చూపినా.. గ్రౌండ్‌లెవ‌ల్లో ఎమ్మెల్యేల నుంచి గ‌ల్లీ నాయ‌కుల వ‌ర‌కూ సాగించిన అవినీతితో జ‌నం విసుగు చెందారు. అది గ్ర‌హించేలోపుగానే అంతాజ‌రిగింది. 2018 తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో చెలిమితో.. బీజేపీను దూరం చేసుకున్నారు.

మోదీ ఓడిపోతార‌నే అంచ‌నాల‌తో మూడోకూట‌మిలో తాను చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌నే అభిప్రాయం బాబును ఊహించ‌ని దెబ్బ‌తీసింది. వార‌సుడుగా లోకేష్‌బాబు అనుకున్నంత విజ‌యవంతం కాలేక‌పోయారు. మాస్‌, క్లాస్‌లో ఎక్క‌డా ఇమేజ్‌ను తెచ్చుకోలేక‌పోయార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. 2019లో ఘోర‌ప‌రాజ‌యం త‌రువాత బాబు విప‌క్ష నేత‌గా 2014కు ముందు పాత్ర పోషించాల్సి ఉంది. కానీ.. వ‌యోభారం.. కేడ‌ర్‌లో భ‌యాందోళ‌న‌లు. ఇప్పుడు వ‌రుస‌గా మాజీ మంత్రులు అచ్చెన్న‌, కొల్లు ర‌వీంద్ర అరెస్టులు. మాజీ స్పీక‌ర్ కోడెల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం. జేసీ బ్ర‌ద‌ర్స్‌ను వెంటాడుతున్న కేసులు. య‌ర‌ప‌తినేని పై సీబీఐ కేసులు. ఇలా.. పార్టీలో బ‌ల‌మైన నేత‌లు కూడా క‌ష్టాల్లో కూరుకుపోయారు. లోకేష్‌బాబులో రాజ‌కీయ ప‌రిణితి పూర్తిస్థాయిలో క‌నిపించ‌ట్లేదంటూ పార్టీ సీనియ‌ర్లే ముఖాన చెబుతున్నారు. ఇలా.. ఇంటా .. బ‌య‌టా ఎదుర‌వుతున్న ప్ర‌తికూల ప‌రిస్థితులు మాన‌సికంగా ఎంతో దృఢంగా.. చెక్కుచెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసంతో ఉండే చంద్ర‌బాబును చిత్తు చేస్తున్నాయ‌నేది ఆ పార్టీ శ్రేణుల ఆవేద‌న‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.