FbTelugu

సాగర మథనం ఇంకెన్నాళ్లో!

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ఈ నెల 30న ముగియనుంది. సెలవులు పోను కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 30న నామినేషన్‌ను అట్టహాసంగా వేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ, సిట్టింగ్‌ పార్టీ, అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్, రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని కూడా పూర్తిచేసింది. ఈ ప్రచారంలో భాగంగానే నామినేషన్‌కు భారీ జనసమీకరణకు కూడా ప్లాన్‌ చేసుకున్నారు. స్థానికంగా టీఆర్‌ఎస్, బీజేపీ కూడా ప్రచారాన్ని ప్రారంభించినా అభ్యర్థులను మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. అభ్యర్థి ఎవరైనా తమకే ఓటు వేయాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, టికెట్‌ వ్యవహారం టీఆర్‌ఎస్‌లో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కుటుంబానికి టికెట్‌ ఇవ్వాలా..

లేక స్థానికుడికి ఇవ్వాలా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే కేసీఆర్‌ స్థానిక యాదవ కుటుంబానికి చెందిన కొందరు నాయకులతో టికెట్‌ వస్తే పోటీకి సిద్ధంగా ఉండాలని ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్టు ప్రచారం సాగింది. బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి బీజేపీకి అక్కడ పెద్దగా బలం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి సాగర్‌లో పదివేల కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. దీంతో ఈసారి పక్క పార్టీ నేతలపై కన్నేసింది. కానీ అది పెద్దగా వర్కవుట్‌ కాలేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలోకి దింపాలని కూడా ప్లాన్‌ చేసింది. కానీ, రాజగోపాల్‌రెడ్డి దీనికి ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఈసారి తన అడుగులను చాలా జాగ్రత్తగా వేస్తోంది బీజేపీ. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిని ప్రకటించే వరకూ తమ అభ్యర్థిని ప్రకటించకూడదన్న నిర్ణయంతో ఉన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ప్రకటిస్తే వారిలో టికెట్‌ రానివారు అసమ్మతిగా తయారవుతారని, వారిని తమవైపునకు తిప్పుకొని టికెట్‌ ఇద్దామన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ బీజేపీకి ఈ అవకాశం ఇవ్వకుండా నామినేషన్ల చివరి రోజు చివరి సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి సాగర్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మరి టికెట్‌ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.