FbTelugu

వారికి రె‘బెల్‌’ మోతేనా..?

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక మరింత వేడిని పెంచుతోంది. అక్కడ పాగా వేసేందుకు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఇటీవల జోరుమీదున్న బీజేపీ కూడా కన్నేసింది. దీంతో ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపి మొదటి విడత ప్రచారాన్ని పూర్తిచేసింది కాంగ్రెస్‌ పార్టీ. దీనికితోడు హాలియాలో భారీ బహిరంగ సభను నిర్వహించి దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న ధీమాలో కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ రాజకీయ నేత జానారెడ్డి ఉన్నారు. అందుకే ప్రత్యర్థులపై చాలెంజ్‌లు సైతం విసురుతున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ నేతలకు కూడా చాలెంజ్‌ విసిరారు.

నామినేషన్లు వేసి ప్రచారానికి వెళ్లకుండా ఎన్నికలను ఎదుర్కొందామా.. డబ్బులు పంచకుండా గెలిచే దమ్ముందా మీకు అంటూ సవాల్‌ విసిరారు అంటే గెలుపుపై ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో అర్ధం అవుతోంది. అయితే, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుంటే టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం అభ్యర్థి ఎంపికలోనే మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎందుకైనా మంచిదన్న దోరణిలో నామినేషన్‌ పత్రాలను రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌లో ప్రధానంగా నలుగురైదుగురు నాయకులు టికెట్‌ కోసం ఆశలు పెట్టుకున్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కు టికెట్‌ వస్తే ఇక్కడి నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ నేత ఆయనకు మద్దతు తెలిపే పరిస్థితి కనిపించడం లేదన్న ప్రచారం సాగర్‌లో జోరుగా సాగుతోంది. ఒకవేళ టికెట్‌ భరత్‌కు కాకుండా ఇతరులకు దక్కితే నోముల వర్గానికి చెందిన వారు అసమ్మతిగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్‌ దక్కినా ప్రత్యర్థులు రెబెల్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బీజేపీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కనివారు ఎవరైనా బలమైన నేత ఉంటే వారిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్‌ ఇవ్వాలన్న ఆశతో ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే బీసీ, ఎస్టీ సామాజికవర్గాల్లో ఒకరికి టికెట్‌ ఇవ్వాలన్న నిర్ణయంతో ఉంది. ఆ టికెట్‌ బీసీలకు ఇవ్వాలనుకుంటే కడారి అంజయ్య యాదవ్‌కు దక్కే అవకాశముంది. ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే రవికుమార్‌కు దక్కే అవకాశముంది.

దీనిని ముందే పసిగట్టిన బీజేపీ నేత నివేదితారెడ్డి ఇప్పటికే ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎప్పటినుంచో ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. ఆమె భర్త నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాగర్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయింది. అయితే, ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ వచ్చే పరిస్థితి లేకపోవడాన్ని గ్రహించిన ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. తాను పార్టీ అభివృద్ధి కోసం ఎప్పటినుంచో కృషి చేస్తున్నానని, తనకు పార్టీ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ టికెట్‌ ఇవ్వకున్నా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలా సాగర్‌లో విజయంపై కన్నేసిన రెండు ప్రధాన పార్టీలకు రెబెల్‌ పోటు తప్పేలా లేదని సాగర్‌ ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి పార్టీ నేతలు రెబెల్‌ సమస్యను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.