FbTelugu

నయాన కాదు భయానే..!

ఎవరినైనా ఇతరులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఎలాగైనా నయానోఓ భయానో ఒప్పించండి అంటుంటాం. వీలయితే బతిమిలాడండి.. లేదంటే భయపెట్టండి అన్న అర్ధంలో వాడతాం. సరే. ఇప్పుడు వీటికి అర్థాలు.. తాత్పర్యాలు ఎందుకు గానీ అసలు విషయానికొద్దాం. ఈ నెల 17న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్, కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ భీష్ముడు, నియోజకవర్గం నుంచి అనేకసార్లు విజయం సాధించి మంచి పట్టున్న కుందూరు జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పొనుగోతు రవికుమార్‌లు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కన్నా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్పించుకునేందుకే ఆసక్తిని చూపుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకోసం కోట్ల రూపాయలను ఆఫర్‌ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బేరాలు ఈ మూడు పార్టీలు చేస్తున్నప్పటికి అధికార టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉన్నట్టుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సర్పంచులను, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను కారెక్కించారు. ఒక సర్పంచ్‌ దీనికి ఒప్పుకోకపోవడంతో వెంటనే ఓ ఎమ్మెల్యే పంచాయతీ అధికారికి ఫోన్‌చేసి సర్పంచ్‌పై చర్యలకు ఆదేశించారు. దీంతో పంచాయతీ రావడం.. అంతకు వారం రోజుల ముందే పంచాయతీ ఆడిట్‌ జరిగినా.. మళ్లీ పంచాయతీ రికార్డులు తీసుకుపోవడం వెంటనే జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఆందోళనకు దిగడంతో తిరిగి రికార్డులు ఇచ్చారనుకోండి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిరంతరం సాగర్‌పై కన్నేశారు. ఇన్‌చార్జిల పేరుతో అక్కడే మకాం వేసి కాంగ్రెస్‌ వారిని తమ పార్టీలోకి చేర్చుకొనేందుకు బెదిరింపులకు కూడా దిగుతున్నట్టు అనేకమంది చర్చించుకుంటున్నారు. సాగర్‌ నియోజకవర్గంలో జానారెడ్డిని ఢీకొట్టాలంటే సాధారణ విషయం కాదు. ఆయనకు నియోజకవర్గంలోని ప్రతి ఊరు.. ఆ ఊరిలోని జనం తెలుసు. ప్రతి గ్రామంలో ఆయన వందమందికి పైగానే పేరు పెట్టి పిలవగల సాన్నిహిత్యం ఉంది. పైగా అక్కడ నుంచి ఆయన అనేకసార్లు విజయం సాధించారు. ఇప్పుడు కొత్తగా బరిలో దిగిన నోముల భగత్‌ జానారెడ్డిని ఢీకొట్టాలంటే కష్టమైన పనే. కానీ, సీఎం కేసీఆర్‌ ఇక్కడ విజయాన్ని కాంక్షిస్తున్నారు. దీనిపై గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే కొంతమందిని నియమించి వారిపై బాధ్యతలు పెట్టారు. ఒకవేళ అక్కడ టీఆర్‌ఎస్‌ ఓడిపోతే తమ రాజకీయ భవిష్యత్‌ కూడా అంతర్థానమయినట్టేనన్న భావనలో సాగర్‌ నియోజకవర్గ ప్రచార ఇన్‌చార్జిలుగా ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం అంత ఈజీగా లేదు.

జానారెడ్డిని ఓడించడం తలకు మించిన భారమే. అందుకే ఆ నేతలంతా ఇప్పుడు ఇక బతిమిలాడితే లాభం లేదని.. కాంగ్రెస్‌ను బలహీనపరిచి జానా ఓటమికి బాటలు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే నియోజకవర్గంలోని కాంగ్రెస్‌కు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ పార్టీలో చేరితే భారీగా ముట్టజెపుతామని కబరు పంపుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ డబ్బులకు లొంగకుంటే అధికారం తమదే కదా అన్న రీతిలో వారిని అనేక రకాలుగా బెదిరింపులకు గురిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ కూడా చేస్తున్నా.. కేవలం డబ్బుల పంపకాలనే ఈ పార్టీ నమ్ముకున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి, ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ జంపింగ్‌ జపాంగ్‌లపై కన్నేసిన ఈ పార్టీల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.