FbTelugu

వాటితో ఎవరికి లాభం?

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్, హైదరాబాద్‌–రంగారెడ్డి–పాలమూరు నియోజకవర్గాల పట్టభద్రుల స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు భారీగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేథావులుగా పరిగణించబడే వీరు ఓటుహక్కుకు దూరంగా ఉంటారు. కానీ, ఇప్పుడు గంటల తరబడి భారీగా లైన్లలో నిలబడి ఓటేశారంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైనా ఆ తర్వాత ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓటేశారంటే ఆశ్చర్యకరంగానే ఉంది. పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటకే ముగిసినా ఆ సమయంలోనూ భారీగా లైన్లు ఉండడంతో వారందరినీ ఓటింగ్‌ అనుమతించారు (నాలుగు గంటల వరకే లైన్లలో ఉండడంతో). ఆ పోలింగ్‌ కొన్ని ప్రాంతాల్లో ఏడు గంటలదాకా సాగింది. ప్రధానంగా సాయంత్రం మూడు గంటల తర్వాత పట్టభద్రులంతా భారీగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఎంతో ఓపికతో ఓటును వినియోగించుకున్నారు. భారీగా ఓట్లు నమోదు కావడంపై అభ్యర్థులంతా తమకే వారంతా ఓటేశారన్న భావనలో ఉన్నారు. అయితే, ఈ భారీ ఓటింగ్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్న చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బులు కూడా పంపిణీ చేసింది. తామిచ్చిన డబ్బులు ఓటర్లకు చేరడం వల్లే సాయంత్రం భారీగా పోలింగ్‌ బూత్‌లకు వచ్చారని, ఆ ఓట్లనీన తమ పార్టీ అభ్యర్థికే పడ్డాయని భావిస్తోంది. లేదు లేదు.. వారంతా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కదిలివచ్చారు.. కాబట్టి అవన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాబట్టి అధికార పక్షానికి పడే అవకాశమే లేదని, తమకే ఆ ఓట్లు పడ్డాయని విపక్షాలు భావిస్తున్నాయి. వాస్తవానికి పట్టభద్రుల స్థానంలో ఓటర్లంతా ఉద్యోగులు, నిరుద్యోగులే. ఇటీవల కాలంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకానికి ఓట్లేయాలని బాహాటంగానే పిలుపునిచ్చాయి. ఇక, సర్కారు తమను పట్టించుకోవడం లేదని, ఉద్యోగాలు కల్పించడం లేదని, ఇంతకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.

రాష్ట్రంలో లక్షా 90వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని నింపకుండా నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు కూడా రోడ్డెక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టభధ్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఓటింగ్‌ శాతం భారీగా పెరిగిందంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందితే ఆ సంతోషంతో ఓటర్లు భారీగా వచ్చి సర్కారుకు అనుకూలంగా ఓటేస్తారు. ఇలాంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం. ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత ఏర్పడిన సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కాకుంటే ఈ పరిస్థితుల్లో ఆ ఓటు ప్రభుత్వానికి నెగెటివ్‌గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్లు సర్కారుపై సంతోషంగా ఉన్న పరిస్థితులైతే ఏమీ కనిపించడం లేదు. నిరుద్యోగులు, ఉద్యోగులంతా సర్కారు విధానాలపైనే గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటర్లు తరలివచ్చారు అంటే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే భావనలో రాజకీయ పరిశీలకులు ఉన్నారు. అయితే, ఈ భారీగా పోలైన ఓట్లు ప్రభుత్వానికి నెగెటివ్‌గా పడ్డాయా.. లేక అధికార పార్టీ డబ్బుల పంపకం వల్ల అనుకూలంగా పడ్డాయా అన్న విషయాన్ని ఎవరూ తేల్చలేక పోతున్నారు. సాధారణంగా అయితే ఇది ప్రభుత్వ నెగెటివ్‌ ఓటే కావచ్చని చర్చించుకుంటున్నారు. ఈ పెరిగిన ఓట్లు ఎవరికి లాభం చేస్తాయో.. ఎవరికి నష్టాన్ని మిగిలిస్తాయో చూద్దాం.

You might also like

Leave A Reply

Your email address will not be published.