FbTelugu

దాని రూటే సపరేట్‌!

అందరిదీ ఒక దారైతే ఆ రాష్ట్రానికి మరో దారి. అన్ని రాష్ట్రాలూ ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తుంటే ఆ రాష్ట్రం మాత్రం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తోంది. అందరిలా తీరిగ్గా కూర్చోకుండా నిరంతరం ప్రజా సంక్షేమం గురించే ఆలోచన చేస్తోంది. భవిష్యత్‌లో రానున్న ప్రమాదాలను ముందే గ్రహించి వాటినుంచి తట్టుకునేందుకు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటోంది. అదే కేరళ రాష్ట్రం. కరోనా కాలంలో కేరళ తీసుకుంటున్న చర్యలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్తుత్తమంగా నిలిపాయి. మొదటి వేవ్‌లో దేశంలోనే మొదటి కేసు అక్కడే బయటపడ్డా ఏమాత్రం ఇబ్బంది పడకుండా కరోనాను కట్టడి చేయడంలో అక్కడి సర్కారు ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. వాస్తవానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రం ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటే కేరళ మాత్రం ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేసే పనిలో పడింది. అందులో భాగంగా అక్కడ మొదటగా విద్య, వైద్యంపై దృష్టిని నిలిపింది. ఇప్పుడు అక్కడ బడి, ఆసుపత్రులు కార్పొరేట్‌ సంస్థలను మించి పనిచేస్తున్నాయి. అక్కడ సౌకర్యాలు, భవనాలు కూడా వాటికి మిన్నగా తీర్చిదిద్దారు. దేశంలోనే ప్రభుత్వ పీహెచ్‌సీల్లో కూడా రిసెప్షన్‌ వ్యవస్థను నెలకొల్పిన రాష్ట్రం కేరళలోనే. రోగి ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి కోలుకొని తిరిగి ఇంటికెళ్లే వరకూ చేయాల్సిన సేవలపై అక్కడి ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చి సేవలు అందిస్తున్నారు.

ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. దేశంలోని రాష్ట్రాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. ఆక్సిజన్‌ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రం లబోదిబోమంటోంది. ఆక్సిజన్‌ సాయం చేయండి మహాప్రభో అన్ని దేశాలనూ వేడుకుంటోంది. కానీ, కేరళ రాష్ట్రం ఒక్కటే ఆక్సిజన్‌ కోసం అవస్థలు పడడం లేదు. అక్కడ ఆక్సిజన్‌ లేక మరణించిన దాఖలాలు లేవు. వారికి కావాల్సిన దానికంటే ఆక్సిజన్‌ను వారే ఉత్పత్తి చేసుకుంటున్నారు. అంతేకాదు దేశంలోని గోవా, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు కూడా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఇదంతా ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం కరోనా ప్రభావం తగ్గిందని రిలాక్స్‌ అవుతుంటే కేరళ మాత్రం భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి దానిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం వల్లే ఇవాళ ఆ రాష్ట్రం ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే స్థాయికి చేరింది. భవిష్యత్‌లో రానున్న ఉపద్రవాన్ని ముందే గ్రహించిన కేరళ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లోనే ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఇప్పుడు ఆ రాష్ట్రానికి రోజుకు 54 టన్నుల ఆక్సిజన్‌ అవసరం. కానీ, ఇప్పుడు కేరళ సర్కార్‌ రోజుకు 140 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. వారు వాడుకోగా మిగిలిన దానికి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి అక్కడి కరోనా రోగుల ప్రాణాలను కూడా నిలబెడుతోంది. గొంతెండినప్పుడు బావి తవ్వుకుందాం అన్న ఆలోచనలో ఉన్న కేంద్రం, ఇతర రాష్ట్రాలకు.. ముందుగానే బావి తవ్వి నీటిని రెడీగా పెట్టుకొని మన గొంతు తడుపుకోవడంతో పాటు మిగతా వారి దాహం తీరుద్దామన్న ఆలోచనలో కేరళ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కదా.. అందుకే కదా అక్కడి ఓటర్లు దశాబ్దాల చరిత్రను తిరగరాసి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అధికారంలో నిలిపారు. మొత్తానికి ప్రజాసేవలో కేరళ సర్కారు రూటే సపరేట్‌ అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.